Nov 02,2023 23:56

ఐటి హబ్‌గా 'శెట్టిపల్లి' : అభినయ రెడ్డి

ఐటి హబ్‌గా 'శెట్టిపల్లి' : అభినయ రెడ్డి

శ్రీ దీర్ఘకాలిక భూ సమస్యకు పరిష్కారం శ్రీ లబ్దిదారులకు ప్రొసీడింగ్‌ అందించిన భూమన్‌

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
శెట్టిపల్లి భూ సమస్య 75 ఏళ్ళ నాటిది. స్వాత్రంత్యం అనంతరం రెగ్యులరైజ్‌ కాకుండా మిగిలి పోయిన చిన్న గ్రామం. ప్రభుత్వాలు మారుతున్నా భూ సమస్యకు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిన నేపధ్యంలో ఎలాగైనా శెట్టిపల్లి రైతులు, ప్లాట్ల కొనుగోలుదారులకు చక్కటి పరిష్కారం కోసం సిఎం జగన్‌మెహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్‌, జేసి, మండల రెవిన్యూ యంత్రాంగం అందరూ కలిసి కట్టుగా చిత్తశుద్ది, నిబద్దతతో పనిచేయడంతో ఈ రోజు శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం లభించి లబ్దిదారుల్లో సంతోషం వచ్చిందని తిరుపతి శాసనసభ్యులు, టీటీడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గురువారం శెట్టిపల్లి సచివాలయం వద్ద శెట్టిపల్లి రైతులకు, ప్లాట్ల కోనుగోలుదారులకు ప్రొసిడింగ్స్‌ను అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ భూ సమస్యను పరిష్కరించడానికి ఏ ఒక్క రూపాయి వసూలు చేయలేదన్నారు. కేవలం శెట్టిపల్లి గ్రామస్థులకు, ప్లాట్ల కోనుగోలుదారులకు ఇచ్చిన మాట ప్రకారం నిస్వార్ధంగా మేలు చేశామన్నారు. నాలుగున్నరేళ్ళ కాలంలో ఎంతో సంతోషానిచ్చే అంశం శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారమన్నారు. జిల్లా కలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి, జేసి డికె బాలాజీ మాట్లాడుతూ శెట్టిపల్లి భూ సమస్య జిల్లా ఏర్పాటైన రెండు వారాల్లోనే తమ వద్దకు వచ్చిందన్నారు. దీన్ని పరిష్కరించడానికి అనేక మార్లు ఎమ్మెల్యే భూమన, డిప్యూటీ మేయర్‌ అభినయ రెడ్డి, శెట్టిపల్లి భూ పరిరక్షణ కమిటీ వారు, మరో వైపు సిఎం నుండి ఆదేశాలు ఇలా వచ్చిన ఒత్తిళ్ళను సంతోషంగా స్వీకరించామని, సమిష్టి కృషితో నేడు శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపామన్నారు. డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ రెడ్డి మాట్లాడుతూ శెట్టిపల్లి భూ సమస్య చాలా జఠిలమైనదని, రైతులకు, ప్లాట్ల దారులకు న్యాయం చేస్తూ ప్రొసిడింగ్స్‌ ఇవ్వగలిగామన్నారు. ఈ విషయంలో అత్యంత క్లిష్టమైన ప్లాట్లదారులను అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సమస్య సులువుగా పరిష్కారం అవ్వడంలో సిపిఎం నేత కందారపు మురళి ఎంతో కృషి చేశారన్నారు. 348 సాగు భూముల్లో 248 మందికి, 2448 ప్లాట్ల దారుల్లో 1396 మందికి ప్రొసిడింగ్స్‌ ఇచ్చామన్నారు. ఇందులో 85 శాతం భూ సమస్య పరిష్కారం అయ్యిందని, మరో రెండు వారాల్లో మిగిలిన 15 శాతం భూ సమస్య పరిష్కారం అవుందన్నారు. ఇంకా 12 లే అవుట్లు సిద్దం చేయవలసి ఉందని, అదీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. శెట్టిపల్లిని ఐటి హబ్‌గా తీర్చిదిద్దుతూ తెలుగుగంగ నీటిని అందిస్తామన్నారు. మంగళం ఆర్‌టీఓ ఆఫీసు నుండి శెట్టిపల్లి గేటు వరకు మూడు నెలల్లో 80 అడుగుల రోడ్డును వేస్తున్నామన్నారు. సిఐటీయు రాష్ట్ర నాయకులు కందారపు మురళి మాట్లాడుతూ చిన వయస్కుడు అయినా శెట్టిపల్లి భూ సమస్య గురించి అభినయ రెడ్డి బాగా అర్ధం చేసుకొని సమస్యను పరిష్కరించడంలో మంచి చొరవ చూపారని అన్నారు. అనేక సంవత్సరాలుగా శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారం కోసం ధర్నాలు, వినతులు పోరాటాలు చేశామన్నారు. మంచి కార్యాచరణతో భూ సమస్యకు పరిష్కారం లభించిందని, అధికారులు, ఎమ్మెల్యే భూమన, అభినయరెడ్డి అందరి సమిష్టి కృషితో శెట్టిపల్లి రైతులకు, ప్లాట్లదారులకు న్యాయం జరిగిందన్నారు. ఒక్క శాతం టీటీడి నిధులు తిరుపతి అభివృద్దికి వినియోగించాలనే విషయంలో ముందుండి పోరాడామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ డాక్టర్‌ ఆర్‌.శిరీష, కమీషనర్‌ హరిత, ఆర్డిఓ నిషాంత్‌ రెడ్డి, తాహశీల్ధార్‌ వెంకటరమణ, డిప్యూటీ తాహశీల్ధార్‌ అశోక్‌ రెడ్డి, విఆర్‌ఓలు భూపతి, సుమన్‌, స్థానిక వైసిపి నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు.