ఐసీడిఎస్ పౌష్టికాహారంలో...
పుచ్చులు..పురుగులు..!
నాణ్యతా లోపంతో 'చిక్కీలు'
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్
బాలింతలు, గర్బవÛతులు, పిల్లుల కోసం స్త్రీ శిశు సంక్షేమశాఖ అందించే పౌష్టికాహారం పుచ్చులు, పురుగులతో ఉంది. ఐసిడిఎస్ కార్యకర్తలు ఈ విషయాన్ని నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా ఇటు ప్రభుత్వం గానీ, అటు ఐసిడిఎస్ అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సర్దుకుపోవాలంటూ సర్దేస్తున్నారు. రెండు రోజుల క్రితం బంగారుపాళ్యం ప్రాజెక్టు పరిధిలో ఐసీడిఎస్ ద్వారా పంపిణీ చేసిన కర్జూరం ప్యాకెట్‌లో పాము కళేబరం దర్శనం ఇవ్వడంతో మరో మారు ఐసీడిఎస్ పౌష్టికాహారం లోపాలు చర్చనీయాంశంగా మారింది. పాము కళేబరం కాదు....కాదు....ప్లాస్టిక్ అంటూ ఐసీడిఎస్ అధికారులు కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసినా అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తున్న కోడిగుడ్లు, బియ్యం, పప్పు, నూనె, చిక్కీలు, పాల నాణ్యతపై ఐసీడిఎస్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరముంది.
గతంలోనూ కుళ్లిన కోడిగుడ్లు, ఉబ్బిన పాల ప్యాకెట్లు, నాసిరకం పామాయిల్, పుచ్చిపోయిన కందిపప్పు సరఫరా అయ్యింది. జిల్లాలోని అనేక సెంటర్లలో కొందరు కార్యకర్తలు ఐసిడిఎస్ జిల్లా అధికార్ల దృష్టికి తీసుకుపోయారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా నాసిరకం కందిపప్పు, గుడ్లు, చిక్కీలు, రాగిపిండి సరఫరా చేస్తున్న గుత్తేదార్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అంగన్వాడీ యూనియన్ నాయకులు, కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. జిల్లా స్థాయి ఐసీడిఎస్ అధికారులు కాంట్రాక్టర్ల నుండీ కమీషన్లు తీసుకొని చూసీ చూడన్నట్లు వ్యవహరిస్తున్న ఫలితంగా పౌష్టికాహారం కాస్తా పుచ్చు .... ఆహారంగా మారిందంటున్నారు.
చిత్తూరు జిల్లా పరిధిలోని 31 మండలాల్లో మెయిన్ 1,795, మినీ 625 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి ఇందులో 2,420 మంది కార్యకర్తలు, సహాయకులు పని చేస్తున్నారు. గర్భవతులు, బాలింతలు, ఏడు నెలల నుండీ 3 సంవత్సరాలోపు పిల్లలు, 3 సంవత్సరాల నుండీ 6 సంవత్సరాల పిల్లలకు స్త్రీ శిశు సంక్షేమశాఖ ద్వారా పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. టేక్ హాం రేషన్ పేరుతో బియ్యం, పాలు, గుడ్ల, చిక్కీలు గర్బవÛతులు, బాలింతలకు అందిస్తే.... అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు సెంటర్‌లోనే ప్రభుత్వ మెనూ ప్రకారం అన్నం వండి వడ్డించాలి.
నచ్చులు...పుచ్చులే....
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంలో బియ్యం, కందిపప్పు, పామాయిల్ సివిల్ సప్లైరు గోడౌన్‌ల నుండీ అంగన్వాడీ కేంద్రాలకు చేరుతోంది. చిక్కీలు, జొన్నపిండి, రాగిపిండి, అటుకులు, బిల్లం, కర్జూరం స్థానికంగా టెండర్లు పిలిచి ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యతను ఐసీడిఎస్ అధికారులు ధృవీకరించిన మేరకు టెండర్‌దారులు అంగన్వాడీ కేంద్రాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. పౌష్టికాహారం సరఫరా చేసే గుత్తేదార్లు ( కాంట్రాక్టర్లు) ఐసీడిఎస్ అధికార్లతో కుమ్మకై నాసిరకం వస్తువులను సరఫరా చేస్తున్నట్లు అంగన్వాడీల యూనియన్లు ఎంతో కాలంగా చెబుతున్నాయి. నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. నాసిరకం వస్తువులు ఇస్తున్నారని అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నాయి. ఇప్పటికైనా పౌష్టికాహారం సరఫరా నాణ్యతాలోపం లేకుండా సరఫరా చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కోరుతోంది.










