Jul 11,2023 21:57

కలెక్టరేట్‌ గిరీషకు వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీలు

రాయచోటి టౌన్‌ : ఐసిడిఎస్‌కు బడ్జెట్‌లో నిధులు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు పి.శ్రీనివాసులు, సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన 36 గంటల నిరసన ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు, న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి ఫలితం లేకపోవడంతో 36 గంటల నిరసన చేపట్టారని పేర్కొన్నారు. సెంటర్లకు రానివారి ఫొటోలు తీసి పెట్టండి అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఏమి చేస్తారో తామూ చూస్తామని హెచ్చరించారు. వివిధ కార్మిక సంఘాల మద్దతులో ఆందోళనలు మరింత ఉధృతం చేయకతప్పదని గుజరాత్‌లో అంగన్వాడీలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని హైకోర్టులో కేసువేశారన్నారు. గ్య్రాడ్యూటీ అమలు చేయమంటే ఇవ్వమని అనడం అంగన్‌వాడీల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. రిటైర్డ్‌ అయిన తరువాత పెన్షన్‌ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇచ్చే రూ.10 వేల వేతనానికే స్వర్గం అంటే ఎంఎల్‌ఎలు, మంత్రులకు ఇస్తున్న లక్షల జీతాలను ఏమనాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చాతుర్వర్ణ వ్యవస్థ తీసుకురావడంలో భాగంగారు నూతన విద్యావిధానం తీసుకొస్తున్నారని చెప్పారు. పిల్లలు లేరని సాకుతో భవిష్యత్‌లో అంగన్వాడీ వ్యవస్థ నిర్వీర్యం చేయనున్నారని వాటి కయ్యే ఖర్చు అంతా కార్పొరేట్లకు ఇవ్వనున్నారని వాపోయారు. మరిన్ని నిధుల్ని ఐసిడిఎస్‌కు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రమోషను,్ల బదిలీలు, జీతాలు, బిల్లులు ఏ ఒక్కటి సకాలంలో జరగలేదన్నారు. ఉద్యోగోన్నతిలో రాజకీయ జోక్యం నివారించాలని, పెండింగ్‌ జీతాలివ్వాలని, మదనపల్లె, కోడూరు, రాయచోటి వర్కర్లు ఆవేదన వెల్లిబుచ్చారు. యాప్‌ల పనిభారం తగ్గించాలని, కనీసవేతనం రూ. 26 వేలివ్వాలని, రిటైర్మెంట్‌కు వయోపరిమితి 62 సంవత్సరాల వరకు పెంచాలన్నారు. సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేయాలని యానియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీలక్ష్మి, రాజేశ్వరి, భాగ్యలక్ష్మి తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అర్హులైన ఆయాలకు ఉద్యోగోన్నతి కల్పించాల్సిందేనని పేర్కొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌ గిరీషకు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు బంగారుపాప, నాగమణి, మధురవాణి, గౌరి, విజయ, ఈశ్వరమ్మ, రమాదేవి, సుజాత, గంగఖాజాబి, సుఖుమారి, ఓబులమ్మ, రమణమ్మ, పద్మజ, కరుణ, అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.