సాలూరురూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌ను తీవ్రంగా నష్టపరిచే విధానాలను విరమించుకోవాలని, ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఈ నెల 10,11 తేదీల్లో కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని మామిడిపల్లిలో అంగన్వాడీ వర్కర్లతో కలిసి ప్రచార పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన సిఎం ఇప్పటి వరకు దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లకు మెయిన్ సెంటర్లలా పరిగణించాలని, పిల్లలకు అమ్మఒడి, యూనిఫాం, షూలు అందజేయాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం రెండురోజలు పాటు ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. కావున మండలంలోని అంగన్‌వాడీలంతా ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు నారాయణమ్మ, శశికళ, మండల కమిటీ సభ్యులు పుష్ప, త్రివేణి, జానకి, కుమారి, సూర్యకాంతం, గంగమ్మ పాల్గొన్నారు.
పాలకొండ రూరల్: పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు న్యాయం చేయాలని, ఐసిడిఎస్ పథకానికి నిధులు కేటాయింపు పెంచాలని కోరుతూ ఈనెల 10, 11 తేదీలలో కలెక్టరేట్ వద్ద 36 గంటల పాటు జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పాలకొండలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పేర్స్ యూనియన్ పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ కార్యదర్శి ఎన్ .హిమాప్రభ, జిల్లా కోశాధికారి బి. అమరవేణి అంగన్‌వాడీ సమస్యలపై తలపెట్టిన ఈ ధర్నాలో అందరూపాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జి.జెస్సీబారు, జి.శారద, పి.శారద, రజిని, ఎ.పద్మావతి, కాదా రాము, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










