Jul 09,2023 20:50

చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పిస్తున్న అంగన్వాడీ కార్యకర్త

 ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  అమ్మ తరువాత అమ్మలై... ప్రభుత్వ పథకాల అమలులో కీలకపాత్రదారులై... చివరికి ఉద్యోగ భద్రతకు నోచుకోక, గౌరవ ప్రదమైన వేతనాలూ అందుకోలేక, రాజకీయ వివక్షతో కొట్టుమిట్టాడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. అందుకు సన్నద్ధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈనెల 10,11 తేదీల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం కలెక్టరేట్ల వద్ద 36 గంటల పాటు మహాధర్నా చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. సోమవారం ఈ రెండు జిల్లాల కలెక్టరేట్లకు అంగన్‌వాడీలు తరలి రానున్నారు. ఇప్పటికే ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు దీక్షలకు సంబంధించిన సన్నాహాలు చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 10 ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 14,00 అంగన్‌వాడీకేంద్రాలు, 60 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. తల్లిపిల్లల ఆరోగ్య పరిరక్షణలోనూ, చిన్నారుల ఆలనపాలనలోనూ నిత్యం తలమునకలై పనిచేస్తున్న అంగన్‌వాడీలకు అన్నింటా సమస్యలు వెంటాడుతున్నాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9ఏళ్లు కావస్తున్నా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాకపోగా, మరింత జఠిలమయ్యాయి. ఐసిడిఎస్‌కు నిధులు పెంచాల్సింది పోయి, కుదిస్తోంది. లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లు కుదించటానికి నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చింది. ఈ కాలంలో ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు నయా పైసా కూడా పెంచలేదు.
ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా 2018లో అంగన్వాడీ వర్కర్లకు 1500, హెల్పరుకు రూ.750, మినీ వర్కరుకు రూ.1250 పెంచుతున్నట్లు ప్రకటన చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. దశాబ్ధాలు తరబడి పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా రూ.11,500, ఆయాలకు రూ.7,500 మాత్రమే అందుతున్నాయి. వేతనాలు పెంచుతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకసార్లు హామీలు ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్‌, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యూటీ అమలు చేయాలని అనేక సార్లు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వానికి చలనం రాలేదు. 2017 నుండి టిఎ బిల్లులు ఇవ్వడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు కమర్షియల్‌ కేటగిరి కింద మీటర్లు మార్చడంతో అధిక బిల్లులు వస్తున్నాయి. ఈ బిల్లులతోపాటు అద్దెలు సకాలంలో విడుదల చేయడం లేదు. విధుల్లో చేరినప్పటి నుంచీ గ్రాట్యుటీ చెల్లించాలంటూ 2022 ఏప్రిల్‌ 25న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. లబ్ధిదారులను కుదించటానికి పోషణ ట్రాక్‌ యాప్‌ను తీసుకువచ్చింది. ప్రైవేటీకరణ విధానంలో భాగంగా రకరకాల యాప్‌లు తెచ్చి పనిభారం పెంచారు. మరోవైపు ఆగస్టు నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారం పంపిణీని నిలిపివేసి, ఇంటింటి రేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి 36గంటల ధర్నాకు పిలుపునిచ్చారు.
ఇవీ డిమాండ్లు
- ఐసిడిఎస్‌కు బడ్జెట్‌లో నిధులు పెంచాలి
- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలి
- మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి
- హెల్పర్ల ప్రమోషన్లకు వయసు 50ఏళ్లకు పెంచాలి.
- రాజకీయ జోక్యం అరికట్టాలి
- పిల్లలకు అమ్మఒడి, యూనిఫారం ఇవ్వాలి
- సర్వీసులో ఉండి చనిపోయిన కార్యకర్తల కుటుంబీకుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
- 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న డిఎ బిల్లులు ఇవ్వాలి.
- వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ ఇవ్వాలి.

సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాటం
సమస్యలు పరిష్కారం చేసేవరకు పోరాడతాం. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. కనీస వేతనాలు అడుగుతున్నాం. ప్రభుత్వానికి కొంత చాకిరీ చేసినందుకు ఉద్యోగులుగా గుర్తించమంటు న్నాం. ఐసిడిఎస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడం తగదు. ఇటువంటి చర్యల వల్ల తమ ఉద్యోగ భద్రతకు ముప్పువాటిల్లడంతోపాటు తల్లి, పిల్లలకు, గర్భిణుల ఆరోగ్యానికి రక్షణ ఉండదు. ఈనేపథ్యంలో చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం దిగిరాకపోతే మరింత ఉధృతం చేస్తాం.
- గంట జ్యోతి లక్ష్మి,
ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి