Mar 02,2023 20:49

icds logo

ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పునర్వ్యవస్థీకరణ
- ఉన్నవి కుదింపు - ఇక నుంచి నియోజకవర్గాల వారీగా..
- ఒక్కో ప్రాజెక్టు కింద 250 పైనే అంగన్వాడి కేంద్రాల నిర్వహణ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుండి నియోజకవర్గాల వారిగా ఐసిడిఎస్‌ ప్రాజెక్టులు మారనున్నాయి. పాలన సౌలభ్యం, విస్తృత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవో 2 వివరిస్తునప్పటికి ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఐసిడిఎస్‌ ప్రాజెక్టులను ఆయా నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంది. తద్వారా కొన్ని ఐసిడిఎస్‌ ప్రాజెక్టులు కనుమరుగవడంతో పాటు సిడిపిఒల సంఖ్యను కూడా కుదించబోతున్నారు. ఉమ్మడి జిల్లా కర్నూలు, నంద్యాలలో 4 ఐసిడిఎస్‌ ప్రాజెక్టులు కనుమరుగు కానున్నాయి.
కర్నూలు జిల్లాలో కర్నూలు రూరల్‌, ఆదోని రూరల్‌ తీసివేసి మంత్రాలయం, వెల్దుర్తిలో కొత్త ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాలను సర్దుబాటు చేయనున్నారు. నంద్యాల జిల్లాలో 8 ప్రాజెక్టులున్నాయి. నియోజకవర్గాల వారిగా పునర్వ్యవస్థీకరిస్తుండడంతో నంద్యాల రూరల్‌ ప్రాజెక్టు, కోవెలకుంట్ల ప్రాజెక్టులను ఎత్తివేసి అంగన్వాడి కేంద్రాలను ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఐసిడిఎస్‌ ప్రాజెక్టులలో విలీనం చేయనున్నారు. నంద్యాల రూరల్‌ను నంద్యాల మున్సిపాలిటీ, నంద్యాల, గోస్పాడు, నంద్యాల మండలం, గోస్పాడు, పాణ్యం, గడివేముల మండలాల పరిధిలో ఉన్న 295 అంగన్వాడీ కేంద్రాలను ఐసిడిఎస్‌ అర్బన్‌ ప్రాజెక్టు కిందికి తీసుకురాబోతున్నారు. అలాగే ఆళ్లగడ్డ నగర పంచాయతీ, చాగలమర్రి, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, సిరివెళ్ల, రుద్రవరం మండలాల పరిధిలో ఉన్న 309 అంగన్వాడీ సెంటర్లను కలిపి ఒక ప్రాజెక్టుగా, బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాల పరిధిలో ఉన్న 274 అంగన్వాడీ కేంద్రాలను కలిపి ఒక ప్రాజెక్టుగా ఏర్పాటు చేయబోతున్నారు. ఆత్మకూరు కింద ఆత్మకూరు నగర పంచాయతీ, శ్రీశైలం, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాల పరిధిలో ఉన్న 250 కేంద్రాలు కలిపి ఒక ప్రాజెక్టుగా, నందికొట్కూరు నగర పంచాయతీ, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, కొత్తపల్లి, మిడుతూరు మండలాల పరిధిలో ఉన్న 285 అంగన్వాడీ కేంద్రాలను ఒక ప్రాజెక్టుగా ఏర్పాటు చేయబోతున్నారు. డోన్‌ అర్బన్‌, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లోని 248 అంగన్వాడీ కేంద్రాలను ఒక ప్రాజెక్టుగా ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో ప్రాజెక్టు కింద 150 నుండి 200 లోపు అంగన్వాడీ కేంద్రాలను చేర్చి పాలనను సక్రమంగా చేపట్టడానికే పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ నంద్యాల జిల్లాలో ఒక్కో ప్రాజెక్టు కింద 250 నుండి 300 వరకు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ జరుగుతుంది. నంద్యాల ప్రాజెక్ట్‌ కింద 295, ఆళ్లగడ్డ 309, బనగానపల్లె 274, డోన్‌ 248, నందికొట్కూరు 285, ఆత్మకూరు 250 అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేశారు. ఒక్కో ప్రాజెక్ట్‌ కింద దాదాపు 250 అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ఉండబోతుంది. జిల్లాలో అదనంగా మరో 2 ఐసిడిఎస్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, వాటిని కుదించి పని భారం పెంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రాల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారం అందించడం, గర్భవతులకు, బాలింతలకు రక్తహీనతను అరికట్టడం, వారికి కావలసిన పోషణను అందించడం కూడా కష్ట సాధ్యమవుతుంది. సిడిపిఒల సంఖ్య తగ్గడంతో పాటు, పర్యవేక్షణ లోపించే అవకాశం లేక పోలేదనే చర్చ జరుగుతుంది. ప్రాజెక్టులపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు కూడా అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిడిపిఒల సంఖ్యను రాష్ట్రవ్యాప్తంగా కుదించే ప్రయత్నం జరుగు తుండడంతో పాటు ఉన్న సిబ్బందిపై పని భారం పెరిగే అవకాశం ఉంది.

జిల్లాలో అదనంగా 2 ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి
కెఎండి.గౌస్‌, సిఐటియు నగర కార్యదర్శి
జిల్లాలో ఉన్న రెండు ప్రాజెక్టులను తీసివేయడం ద్వారా మిగిలిన ప్రాజెక్టులలో పని భారం పెరుగుతుంది. పని భారం తగ్గించడం కోసం 150 నుంచి 200 లోపు ఉన్న అంగన్వాడీ కేంద్రాలను కలిపి ఒక ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి నియోజకవర్గాల వారిగా ప్రాజెక్టులకు పునర్వ్యవస్థీకరణ చేస్తున్నామని చెప్పారు. ఆచరణలో చూస్తే ఒక్కో ప్రాజెక్టు కింద 250 పైన అంగన్వాడీ కేంద్రాలు రావడంతో సిబ్బందిపై పనిభారం పెరుగుతుంది. అందువలన నంద్యాల జిల్లాకు మరో 2 ఐసిడిఎస్‌ ప్రాజెక్టులను అదనంగా ఏర్పాటు చేయాలి.