ఐసిడిఎస్ ప్రాజెక్టుల కుదింపును విరమించుకోవాలి
కోవెలకుంట్ల,నంద్యాల రూరల్ ప్రాజెక్టులను కొనసాగించాలి
సిఐటియు నాయకులు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఐసిడిఎస్ ప్రాజెక్టుల కుదింపును ఉపసంహరించుకోవాలని, కోవెలకుంట్ల,నంద్యాల రూరల్ ప్రాజెక్టులను కొనసాగించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసు రత్నం, జిల్లా ఉపాధ్యక్షులు కె. ఎం డి గౌస్,అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం నిర్మలమ్మ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట లక్షమ్మ లు డిమాండ్ చేశారు.ఐసీడి ఎస్ ప్రాజెక్ట్ ల ఎత్తివేతను నిరసిస్తూ సోమవారం నాయకులు జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు కలెక్టరేట్ స్పందన జరుగుతున్న ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయని ఎనిమిది ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ విధులు నిర్వహిస్తున్నారన్నారు.గత 30 సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వము నంద్యాల జిల్లాలోని ఎనిమిది ప్రాజెక్టులలో రెండు ప్రాజెక్టులు ఎత్తివేస్తూ ఆ రెండు ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడి వర్కర్లను హెల్పర్స్ ను ఆరు ప్రాజెక్టులలో విలీనం చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వలన అంగన్వాడి వర్కర్స్ కే కాక చిన్నపిల్లలకు గర్భవతులకు బాలింతలకు ప్రభుత్వ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావని తెలిపారు. ఐసిడిఎస్ ప్రాజెక్టుల కుదింపువల్ల అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రాజెక్టుల కుదింపు వల్ల అంగన్వాడి వర్కర్స్ కు ప్రయాణ సౌకర్యం మరియు గ్రామాలకు పోవడానికి ఆటోల సౌకర్యం లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే గ్రామాలకు బస్సుల సౌకర్యం లేదని ఆటోలపై ఆధారపడి ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు.ఆటోలలో పూర్తిస్థాయిలో పదిమంది ఉంటే తప్ప ఆటో డ్రైవర్ గ్రామాలకు రారని,ఎటు చూసినా అంగన్వాడి వర్కర్స్ మీటింగ్ అయిపోయిన వెంటనే గ్రామాలకు చేరుకునే పరిస్థితి లేదన్నారు.గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టులను కుదింపు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వము గర్భవతులకు బాలింతలకు చిన్న పిల్లలకు పేదలకు పౌష్టిక ఆహారం అందించడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే 2015 సంవత్సరం నుండి అంగన్వాడి వర్కర్స్ కు టీఏడీఏలు లేవని,ఈ మార్పు వల్ల నెలకు కనీసం మూడు వేల రూపాయల చేతుల నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎటు చూసినా అంగన్వాడి వర్కర్స్ తీవ్రంగా ఇబ్బందులు పడి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉందని,రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయకుండా గతంలో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి 8 ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒక్కొక్క ప్రాజెక్టులు 300 సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల పర్యవేక్షణ లోపం కూడా జరుగుతుందని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ప్రాజెక్టులకు కుదింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండే విధంగాప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ పిడి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పాత పద్ధతిని కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమం లో జిల్లా నాయకురాలు సరస్వతి దేవి నష్రూమ్ పుల్లమ్మ మహాలక్ష్మి దైవమా సుజాత సువర్ణ భాగ్యలక్ష్మి సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.










