- బడ్జెట్ కేటాయింపులు పెంచాలి
- అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ
- ఘనంగా యూనియన్ జిల్లా 8వ మహాసభ
ప్రజాశక్తి - పలాస : రోజురోజుకూ ఐసిడిఎస్‌కు నిధులు తగ్గిస్తూ ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా 8వ మహాసభ కాశీబుగ్గ ఎస్‌ఎంసి ఫంక్షన్ హాల్‌లో శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న నూతన విద్యా విధానం ఐసిడిఎస్ లక్ష్యాన్ని నిర్వీర్యం చేసేలా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌కు బడ్జెట్ కేటాయింపు పెంచి మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. 2022 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ అమలు చేయాలని ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తక్షణమే అమలు చేయకపోతే పోరాటాలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనాలు కన్నా అదనంగా ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని, కానీ ఆ హామీని అమలు చేయలేదన్నారు. విధుల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మతి చెందితే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల పని భారం తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు రూ.ఐదు లక్షల గ్రాట్యుటీ చెల్లించాలని కోరారు. మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా మార్చాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి పథకం అమలు చేయడంతో పాటు ఉచితంగా బూట్లు, పుస్తకాలు, బెల్టు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ ఒత్తిళ్లు ఆపాలన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని, ఐసిడిఎస్‌ను కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాలన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు కె.హేమసూదన్, ఎం.గణపతిరావు, లక్ష్మీనారాయణ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సమావేశంలో ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి.సుదర్శనం, జిల్లా కోశాధికారి కె.కళ్యాణి, కాశీబుగ్గ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు డి.ఆదిలక్ష్మి, ఎం.మంజులా కుమారి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు, కోశాధికారి అల్లు సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శులు ఎన్.గణపతి, ఎస్.లకీëనారాయణ తదితరులు పాల్గొన్నారు.










