Aug 01,2023 22:50

పట్టుబడిన గంజాయితో డిఎస్పీ, మురళీకష్ణ తదితరులు


ప్రజాశక్తిు-భట్టిప్రోలు
భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామం వద్ద అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఐదుగురు ముద్దాయిల నుండి పోలీస్‌లు 5 కేజీల గంజాయిని స్వాధీన పర్చుకున్నారు. రేపల్లె డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల ఎస్‌ పి వకుల్‌ జిందాల్‌కు వచ్చిన సమచారం మేరకు ఐలవరం బస్టాండ్‌ వద్ద గంజాయి విక్రయిస్తున్న చీరాలకు చెందిన ప్రస్తుతం గుంటూరులో నివాసం ఉంటున్న మేలం బిందు, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన గోవాడ భానుప్రసాద్‌, తెనాలి మండలం కొలకలూరుకు చెందిన షేక్‌ అరిఫా, షేక్‌ సైఫా, గుంటూరు హౌసింగ్‌ బోర్డుకు చెందిన చుక్కా శ్రీకాంత్‌ల నుండి గంజాయిని స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. మేలం బిందు తన భర్త సుధాకర్‌ను వదిలేసి విడిగా ఉంటూ వీరాంజనేయులు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. వీరాంజనేయులు జిరాక్స్‌ సెంటర్లో పని చేస్తూ వచ్చే జీతం చాలక విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి గుంటూరులో బిందుతో కలసి అమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో జూన్‌ 20 వ తేదీన గంజాయి కొనుగోలుకు ఏజెన్సీకి వెళ్లి కెడి పేటలో పోలీస్‌లకు పట్టుబడి జైలుకు వెళ్ళాడు. కాగా ముద్దాయిలలో మిగిలిన వారు గంజాయి కావాలని బిందును అడుగగా గుంటూరులో అయితే అనుమానం వస్తోంది. కాబట్టి ఐలవరం గ్రామం వద్ద అనుమానం రాదని అక్కడికి వస్తే గంజాయిని మీకు విక్రయిస్తానని చెప్పటంతో వారంతా ఐలవరం వచ్చి బస్టాండ్‌ వద్ద విక్రయిస్తుండగా ఎస్‌పికి అందిన సమాచారం మేరకు మాటు వేసి పట్టుకున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె సిఐ ఎం.నజీర్‌ బేగ్‌, వేమూరు ఎస్‌ఐ జె.నాగరాజు, భట్టిప్రోలు తహశీల్ధార్‌ వెంకటేశ్వరరావులు ఉన్నారు.