సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, శాంతిరాజు
ప్రజాశక్తి- రాజవొమ్మంగి : గంగవరంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు, కె.శాంతిరాజు పిలుపునిచ్చారు. ఆదివారం గంగవరంలో సిఐటియు జిల్లా నాయకురాలు కె.రాణి అధ్యక్షతన మండల ప్రధమ మహాసభ జరిగింది, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.రామరాజు, కంభం శాంతిరాజు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా, పెరుగుతున్న ధరలను బేరీజు వేసుకుని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్మికులకు గడచిన 15ఏళ్లుగా కనీస వేతన చట్టసవరణ జరగకపోవడంతో, అరకొర వేతనాలో, అర్థాకలితో కార్మిక కుటుంబాలు జీవనం సాగించాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం నిర్ధేశించిన నిబంధనలకు లోబడి కార్మికుల శ్రమదోపిడిని నివారించి, గౌరవప్రదమైన వేతనాలు ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ు సరళీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా కనీస వేతన సాంప్రదాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసరాలు, విద్య, వైద్యం ఇతరత్రా ఖర్చులను దృష్టిలో పెట్టుకొని అన్‌సిల్క్ కార్మికుల స్థాయి నుంచే కనీస వేతనాన్ని నెలకు రూ.26వేలకు పెంచి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
సిఐటియు మండల నూతన కమిటీ ఎన్నిక
సిఐటియు మండల మహాసభలో మండల కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, కార్యదర్శులుగా మడకం, వీరమ్మ, కొర్రపు రాణి, ఉపాధ్యక్షులుగా కె.రాణి, టి.విజయకుమారి, మార్తమ్మ, సహాయ కార్యదర్శులుగా సిహెచ్ రమాయమ్మ, ఎస్ వెంకటలక్ష్మి, ఇ.సత్యనారాయణ, కోశాధికారిగా జి.వెంకయమ్మలతోపాటు మరో పన్నెండు మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి పోరాడాలని కొత్తకమిటీ నిర్ణయించింది. కార్యక్రమంలో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.










