ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ఆగస్టు 9న జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను గిరిజనులంతా ఐక్యంగా ఉండి నిర్వహించేందుకొనేందుకు తీర్మానించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో గిరిజన జెఎసి, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నేటితరం యువతకు తెలియజేయాలని అన్నారు. ఆదివాసీలు నివసిస్తున్న గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. దీనికి విరుద్ధంగా ప్రతి ఏటా ప్రభుత్వం పార్వతీపురంలో నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. ఐటిడిఎ అధికారులు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా మనకు మనమే చందాలు ఎత్తుకొని మన ఉనికిని కాపాడుకోవాలని నిర్ణయించారు. ఈ ఏడాది నిర్వహించబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ప్రతి గ్రామం నుంచి యువత, మహిళలు, ఉద్యోగులు వచ్చి జయప్రదం చేయాలని, మన ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు కె.లక్ష్మణమూర్తి, పువ్వల సత్యనారాయణ, నందివాడ కృష్ణబాబు, మండంగి రమణ, కోలక అవినాష్, కడ్రక మల్లేశ్వరరావు, పాలక క్రాంతికుమార్, ఎల్.లోవరాజు, ధర్మారావు, యువత, ఉపాధ్యాయులు, ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు.
ఆదివాసీ హక్కుల పరిరక్షణ స్టీరింగ్ కమిటీ ఎన్నిక
అనంతరం ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక స్టీరింగ్ కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. ప్రధాన సలహాదారుగా కోలక లక్షణామూర్తి, కన్వీనర్‌గా కోలక అవినాష్ ఎన్నికయ్యారు. అలాగే స్టీరింగ్ కమిటీ సభ్యులుగా మండంగి రమణ, ఆరిక ధర్మారావు, కడ్రక మల్లేశ్వరరావు, పాలక క్రాంతికుమార్, బిడ్డిక రమేష్, ఇంటి కుప్పల రామకష్ణ, నిమ్మక శ్రీరాము, పత్తిక శంకరరావు, మండంగి శ్రీనివాసరావు, తోయక నాగభూషణరావు ఎన్నికయ్యారు.










