Apr 02,2023 01:25
మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: దేశంలో, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఉమ్మడిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. శనివారం బాపట్ల సిపిఐ కార్యాలయంలో వామపక్షాల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏప్రిల్‌ 14 నుంచి మే 14 వరకు జరిగే వామపక్షాల ఉద్యమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం పెద్దఎత్తున ప్రజలపై అధిక ధరల భారం మోపుతూ ఆర్థికంగా కుంగదీస్తూ కార్పొరేట్‌ సంస్థలకు దేశ ప్రయోజనాలను ఫణంగా పెడుతోందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సిపిఎం, సిపిఐ పార్టీలు ఉమ్మడిపోరుకు సిద్ధమయ్యాయన్నారు. నెల రోజుల పాటు జరిగే ప్రజా చైతన్య ప్రచార యాత్రలు జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్‌ మణిలాల్‌, టి కృష్ణమోహన్‌, ఆర్‌ వినోద్‌, సిపిఐ బాపట్ల ఏరియా కార్యదర్శి జెబి శ్రీధర్‌ పాల్గొన్నారు.