ప్రజాశక్తి-నెల్లిమర్ల, గరివిడి, రాజాం, విజయనగరంటౌన్ : ఐక్య పోరాటాల ద్వారానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోగలమని సిపిఎం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. లోక నాధం అన్నారు. 'విశాఖ స్టీల్‌ప్లాంట్ రక్షణ యాత్ర' పేరిట సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ర్యాలీ గురువారం విజయనగరం నుంచి నెల్లిమర్ల చేరుకుంది. అక్కడి నుంచి గరివిడి, రాజాం మీదుగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల చేరుకుంది.

ఈ సందర్భంగా నెల్లిమర్ల మండలం మొయిద జంక్షన్, గరివిడి పెట్రోల్‌బంకు జంక్షన్, రాజాం అంబేద్కర్ జంక్షన్‌లో బైక్‌యాత్రకు పలు ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు, స్కీం వర్కర్లు, ప్రజలు స్వాగతం పలికారు. గరివిడిలో బైక్ యాత్ర చేపట్టిన నాయకులపై పూలు చల్లి స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని నినాదాలు చేశారు. మోడీ పాలన తీరుపై పాటలు పాడుతూ డాన్సులు చేశారు. ఆయా సెంటర్లలోజరిగిన సభల్లో సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా సి పిఎం ఆధ్వర్యంలో ఉక్కు రక్షణ బైక్ యాత్రను చేపట్టిందని తెలిపారు. పోరాటాల ద్వారా స్టీల్ ప్లాంట్ పరిరక్షించు కోవాలని పిలుపునిచ్చారు. మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తోందని, అందులో భాగంగానే ఎల్‌ఐసి , బిఎస్‌ఎన్‌ఎల్, రైల్వే, విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి పూనుకుందన్నారు. విశాఖ ఉక్కును పరిరక్షించాలని 1000రోజులుగా ప్రజలు, కార్మికులు పోరాటం చేస్తున్నారని, వారిని ప్రభుత్వం భయ పెడుతున్నా మొక్క వోని ధైర్యం తో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అధికార వైసిపి, ప్రతిపక్షాలు టిడిపి, జనసేన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, ప్రైవేటీకరణను అడుకోవడం లేదని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై ఉత్తరాంధ్ర నుంచి సుమారు 2 లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయని, అలాంటి పరిశ్రమను నేడు పోస్కో లాంటి కంపెనీలకు అమ్మేయాలని ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. ఐక్య పోరాటాల ద్వారా పరిరక్షించు కోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, రెడ్డి శంకర్రావు, స్టీల్‌ప్లాంట్ యూనియన్ నాయకులు రామారావు, సిఐటియు టివి రమణ, కె.సురేష్, ఎ.జగన్మోహనరావు, బి.సుధారాణి, ఎ.గౌరినాయుడు,జె.విశ్వనాధరాజు, బి.రమణ, కిల్లంపల్లి రామారావు, కె.రామ్మూర్తినాయుడు, ఎస్‌ఎఫ్ నాయకులు పి.రామ్మోహన్, ప్రభాకర్, జితేంద్ర, ఫ్యాకర్ కార్మికులు పాల్గొన్నారు.

గురజాడకు నివాళి
తొలుత విజయనగరంలో గురజాడ 161వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోక్‌నాధం, జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడారు. గురజాడ అప్పారావు స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకు, భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్న పాలకుల విధానాలను ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. గురజాడకు నిజమైన వారసులు కమ్యూనిస్టు లేనని అన్నారు. అనంతరం రెండోరోజు బైక్‌ర్యాలీ ప్రారంభమైంది. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, రామ్మోహన్, పి.రమణమ్మ, ఎ.జగన్మోహన్, బి.రమణ పాల్గొన్నారు.











