Sep 09,2022 23:54

దీక్షలో పాల్గొన్న సిఎఫ్‌టియు మహిళలు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఐక్య పోరాటాలతోనే ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోగలమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 575వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో కోకో ఒవెన్‌ విభాగ కార్మికులు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ, జిల్లాలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయా పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, కార్మిక నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రయివేటీకరణను విరమిస్తున్నట్లు ప్రకటించాలని కోరారు. లేకుంటే ఈ పోరాటాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్‌, బోసుబాబు, ఎన్‌.రామచంద్రరావు, వరసాల శ్రీనివాసరావు, వై.మస్తానప్ప, బి.కామేశ్వరరావు, కోకో ఒవెన్‌ విభాగం కార్మికులు కర్రి బాబూరావు, జ్యోతీప్రసాద్‌, కె.రవణాజీ, కొల్లి నాగేశ్వరరావు, గోపాల్‌రాజు, బి.సూర్య, మోహిద్‌న్‌, వై.శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ను ఎలా అమ్ముతారు...?
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : స్టీల్‌ప్లాంట్‌ తో సహా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఏ ఒక్కదానిని స్థాపించని బిజెపికి వాటిని ప్రయివేటు వ్యక్తులకు దారాదత్తం చేసే హక్కు ఎవరు ఇచ్చారని సిఎఫ్‌టియుఐ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కె.లక్ష్మి ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు శుక్రవారం నాటికి 526వ రోజుకు చేరాయి. దీక్షల్లో సిఎఫ్‌టియుఐకి చెందిన మత్స్యకార మహిళలు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ సాధన పోరాటంలో, స్థాపనలో బిజెపి ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. అటువంటప్పుడు దానిని అమ్మే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ దీక్షల్లో ఎం.లక్ష్మి, ఎం.దివ్య, రఘు, దుర్గ, సత్యవతి, బాలు, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.