Apr 18,2023 00:32

నూతన కమిటీ ఇదే

ప్రజాశక్తి-బాపట్ల : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కార్మికులు ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని సిఐటియు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.మజుందర్‌ తెలిపారు. సిఐటియు బాపట్ల జిల్లా 8వ మహాసభ స్థానిక ఎన్‌జిఒ హోంలో శుక్రవారం నిర్వహించారు. మహాసభకు బి. తిరుమలరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మజందర్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికినట్లు తెలిపారు. అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తీసివేస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌ ,పోస్టల్‌ ,రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, రక్షణ రంగాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు, కార్పొరేట్‌ శక్తులకు కారు చౌకగా కట్టబెడుతూ దేశ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర ప్రజలు ఐక్య పోరాటం, ప్రాణ త్యాగాలు చేసి సాధించు కున్నట్లు తెలిపారు. కొందరు ప్రజా నాయకులు తమ ఎమ్మెల్యే మంత్రి పదవులను తణప్రాయంగా వదులుకొని రాజీనామాలు చేసి విశాఖ ఉక్కును సాధించుకున్నటు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోనున్న వైసిపి, ప్రతిపక్షంలోఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థిస్తున్నట్లు విమర్శించారు. ప్రజలు కార్మికులు ఐక్య పోరాటాలు చేసి తమ హక్కులు, చట్టాలను కాపాడుకోవాలన్నారు.
సిఐటియు నూతన కార్యవర్గం ఎన్నిక
సిఐటియు ఎనిమిదవ మహాసభ సందర్భంగా బాపట్ల టౌన్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా జంగం శామ్యూల్‌, అధ్యక్షుడిగా ఒ.లక్ష్మణరావు ఎన్నికయ్యారు. మరో 11 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఆర్‌టిసి స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ ుూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. కుమార్‌, ఎస్‌ .యోగానంద్‌, అగ్రికల్చర్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకుడు నిరంజన్‌, వ్యవసాయ కళాశాల, గ్రామపంచాయతీ కార్మికులు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.