
ప్రజాశక్తి కురుపాం / గుమ్మలక్ష్మీపురం : తమ స్వార్ధ రాజకీయాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులు, చట్టాలపై దాడి చేస్తున్నాయని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.చిన్నంనాయుడు అన్నారు. ఐక్య పోరాటాల తోనే హక్కులకు రక్షణ ఉంటుందని అన్నారు. ఎపి గిరిజన సంఘం ఏడో జిల్లా మహా సభలు కురుపాంలో గురువారం ప్రారంభమ య్యాయి. ఈ సందర్భంగా రావాడ కూడలి నుంచి స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను పాలక వర్గాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. కేంద్రప్రభు త్వం అదానీ, అంబానీలకు టూరిజం పేరుతో 23 విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందన్నారు. కంపెనీల పేరుతో అనుమతులు ఇస్తూ అడవి నుంచి గిరిజనులను వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తోందన్నారు. ఇదే జరిగితే తరతరాల నుంచి అడవిని నమ్ముకొని బతుకుతున్న గిరిజనులు అడవికి దూరం కాక తప్పదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం బోయ వాల్మీకిలను ఎస్‌టి జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిం దన్నారు. రాష్ట్రంలో అటవీ హక్కు, ఉపాధిహామీ, పీసా చట్టాలకు రక్షణ కరువైందన్నారు. గిరిజన యువతకు నూరుశాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే జిఒ 3ను ఎత్తివేసిందన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే మాట్లాడనీ యకుండా నిర్బంధం చేసే పాలన సాగుతుందన్నారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.సత్యనారాయణ మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరుతో రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మూసివేసిందన్నారు. మూడు, నాలుగు తరగతులను హైస్కూల్లో , ఒకటి రెండు తరగతులు అంగన్వాడీ కేంద్రంలో విలీనం చేస్తున్నాయన్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లడానికి గిరిజన విద్యార్థులు ఆసక్తి చూపడంలేదని, విద్యకు దూరమవుతున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని రద్దుచేసి కార్పొరేట్ విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించే పనిలో బిజెపి ప్రభుత్వం ఉందన్నారు.

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ మాట్లాడుతూ నేటికీ గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక వసతుల్లేవన్నారు. డోలీలపై రోగులను వైద్యం కోసం తీసుకొచ్చిన సందర్భాలు కనిపిస్తున్నాయన్నారు. అటవీ ఫలసాయాలను జిసిసి కొనుగోలు చేయక పోవడంతో దళారీలకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. ఐటిడిఎ, జిసిసి ఆధ్వర్యాన జీడి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. అడవి ఏనుగుల సమస్య ఉన్నా వాటిని తరలించడంలో స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిదేళ్ల పాలనలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. ఐదో షెడ్యూల్లో ఉన్న ఐదు లక్షల ఎకరాల భూమిని గనులు తవ్వడానికి కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిందన్నారు. 3.50లక్షల ఉద్యోగాలు రైల్వేశాఖలో ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసే ఆలోచన లేకపోవడం దుర్మార్గపు పాలనకు నిదర్శనం అన్నారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్‌పరం చేసే విధానాలను బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఆనాటి శ్రీకాకుళం రైతాంగ పోరాట ఉద్యమంలో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా గిరిజన అభివృద్ధికి ఏర్పడ్డ ఐటిడిఎ, జిసిసి సంస్థలు నిర్వీర్యమయ్యే పరిస్థితిలో ఉన్నాయన్నారు. 1/70 చట్టానికి రక్షణ కరువైందన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు గిరిజనులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎపి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సీదరపు అప్పారావు, కార్యదర్శి మండంగి శ్రీనివాసరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు మండంగి రమణ, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు.











