Apr 25,2023 22:52

కాకినాడ లోని ధర్నా చౌక్‌ వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు



- ఎపిజెఎసి అధ్యక్షుడు బొప్పరాజు
- కాకినాడలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ధర్నా
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మికులు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని ఎపిజెఎసి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఎపిజెఎసి ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం కాకినాడ లోని ధర్నా చౌక్‌ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి పలు ప్రజాసంఘాలు, సిపిఎం, సిపిఐ, సిఐటియు, గవర్నమెంట్‌ రిటైర్డ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించి అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. రెగ్యులర్‌, సిపిఎస్‌, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌, కంటింజెంట్‌, టైమ్‌ స్కెల్‌, రోజువారీ వేతన జీవులు, ఉపాధ్యాయులు, కార్మికులు, స్కీమ్‌ వర్కర్లు, పెన్షనర్స్‌ సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర ఆదాయం రూ.లక్ష కోట్లు అయితే ఉద్యోగులకే రూ.90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పడం దారుణమన్నారు. వాలంటీర్ల జీతాలతో పాటు, సలహాదారులు, స్పెషలిస్ట్‌లు, ఎపి ఉద్యోగులకు చెల్లించే మొత్తం రూ.60వేల కోట్లకు మించి ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు గత చర్చల్లో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా ఎపిజెఎసి అమరావతి ఉద్యమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ కింద రెగ్యులర్‌ చేయాలని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు పెంచాలని,సీనియర్స్‌కు వార్షిక ఇన్‌క్రిమెంట్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాలు పోరాటాలు జరిపిన ఫలితంగా అనేక ప్రయోజనాలు పొందామని, ప్రధాన డిమాండ్లు పరిష్కారం కోసం తప్పనిసరిగా అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు.11వ పిఆర్‌సి బకాయిలు చెల్లించాలని,12వ పిఆర్‌సి నియమించాలని, పెన్షనర్లకు డిఆర్‌ ఏరియర్స్‌ పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాధ్‌ మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారానే ఫలితాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్ల న్యాయమైన కోర్కెల సాధనకు పోరాడతామన్నారు. కార్యక్రమంలో జెఎసి జిల్లా చైర్మన్‌ పితాని త్రినాథరావు, సంసాని శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, సిహెచ్‌ రాజకుమార్‌, మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా నాయకులు మోహనరంగా, శివాజీ, శ్రీనివాస్‌, ఆర్‌టిసి డ్రైవర్ల సంఘం నాయకులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు మొత్తం 800 మంది ధర్నాలో పాల్గొన్నారు.