ప్రజాశక్తి-గుంటూరు : ఐఎఎస్ వంటి సివిల్ సర్వీసులకు హాజరయ్యే అభ్యర్థులకు కచ్చితమైన, స్పష్టమైన లక్ష్య సాధనతో కూడిన కృషి అవసరమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బ్రాడీపేట యుటిఎఫ్ సమావేశ మందిరంలో కెవిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ (సన్) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐఎఎస్ ఫౌండేషన్ శిక్షణ తరగతులను లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎఎస్ గానీ, ఇతర సివిల్ సర్వీసులు రాయదలుచుకున్న వారికి 21 సంవత్సరాలు నుండి 32 ఏళ్లలోపు వయస్సుతో పాటు, డిగ్రీ కనీస అర్హతగా ఉంటుందని చెప్పారు. సివిల్స్ పరీక్షలు ప్రధానంగా మొదటి పరీక్ష ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా 400 మార్కులకుగాను కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుందన్నారు. మెయిన్స్ పరీక్షల్లో కూడా 1750 మార్కులకుగాను 50శాతంపైగా సాధించినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారని వివరించారు. ర్యాంకుల ఆధారంగా ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్‌ఎస్ వంటి కేడర్లకు ఎంపిక చేయబడతారని తెలిపారు. స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ కార్యదర్శి సాయికు మార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఐఆర్‌ఎస్ శిక్షణ పూర్తి చేసిన అశ్విన్ కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు టిఆర్ రమేష్, డాక్టర్ సత్యనారాయణ ప్రసాద్ పాల్గొన్నారు.










