ప్రజాశక్తి-గుంటూరు : మహిళలపై హింసను అరికట్టాలని, మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించాలని, హింస లేని సమాజం కోసం చేయి చేయి కలుపుదాం అని జులై 28 నుండి ఆగస్టు 8 వరకూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పోరుయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐద్వా అధ్యక్షురాలు కె.పద్మ పిలుపునిచ్చారు. గురురువారం బ్రాడీపేటలోని ఐద్వా కార్యాలయంలో పోరుయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మా మాట్లాడుతూ మహిళలపై, చిన్నారులపై రోజురోజుకీ హింస పెరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు. దేశంలో ఏదో ఒక మూలన నిమషానికి ఒక అగాయిత్యం జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురైనా, మణిపూర్ మహిళలను నగంగా వీధుల్లో తిప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించట్లేదని, చట్టాలెన్ని ఉన్నా వాటి అమలులో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు.ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్‌లో దళిత బాలిక మనీషాపై దారుణ హత్య చేశారని, ఆసిఫాను చిదిమేశారని అన్నారు. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం పూనుకుంటుందని, కేంద్ర ప్రభుత్వానికి మానవత్వం, సమానత్వం లేదని రుజువైందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పోరుయాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి ఎ.కళ్యాణి ఎ.పద్మ, బి.కోటేశ్వరి, ఎం.పద్మ పాల్గొన్నారు.










