
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : జిల్లాలోని ఆమదాలవలస మండలం అక్కులపేటలో కుటుంబ కలహాలతో తల్లి, కుమార్తెలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. అందులో తల్లి సుజాత మృతి చెందగా, ఇద్దరు కుమార్తులు మౌనిక, మేఘనలు జిల్లా సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ కన్వీనర్ అల్లాడ లక్ష్మి, అంగన్వాడీ వర్కర్సు అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు పంచాది లతలు శనివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అక్కడున్న సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వరకట్న దురాగతంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారని అన్నారు. అందువల్లే నానాటికీ వరకట్న వేధింపులు తీవ్రమవుతున్నాయని అన్నారు. సుజాత మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తల్లి మృతి చెందగా, తండ్రి జైలు పాలవడంత్తో పిల్లలిద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారిని ప్రభుత్వమే ఆదుకొని మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించాలన్నారు. కోలుకున్న తరువాత చిన్నారులకు ఉన్నత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.