ప్రజాశక్తి-చింతూరు
కేరళలోని త్రివేండ్రంలో ఈనెల 6 నుండి 9వ తేదీ వరకు జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆలిండియా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని ఏడుగురాళ్లపల్లిలో ఐద్వా జెండాను సీనియర్ నాయకులు పట్రా లక్ష్మి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా మండల అధ్యక్షులు మల్లం సుబ్బమ్మ ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి ప్రధాన లక్ష్యాలుగా 1981లో ఐద్వా ఏర్పడినట్లు చెప్పారు. నాటి నుండి మహిళలపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా మహిళలను ఐక్యం చేసి పోరాటాలు చేస్తోందని తెలిపారు. మహిళల అక్షరాస్యత పెంపుదలకు, ఉపాధి అవకాశాలు కోసం ఐద్వా నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నాయని, వారిని గృహిణిగా ఇంటికి మాత్రమే పరిమితం చేయాలని కుట్రతో రాజకీయ సామాజిక అవగాహన కల్పించేందుకు శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. మద్యపాన నిషేధం, చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్, మహిళా చట్టాలను పటిష్టంగా అమలు పరచడం, పని ప్రదేశాలలో మహిళలకు రక్షణ కల్పించడం, తదితర అంశాలు ఎన్నికల వాగ్దానాలుగా మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో జరిగే ఐద్వా ఆలిండియా మహాసభలు మహిళలకు సంపూర్ణ స్వరాజ్యం సాధించే దిశగా తీర్మానాలు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తాటికొండ విజయలక్ష్మి మాసాబత్తుల మంగ తాయారు, పట్రా నాంచారి, జయ, గంటల పార్వతి, సవలం రాజమ్మ, ఉదయం సాయమ్మ, కడియం రాజమ్మ, కారం లక్ష్మి, కణితి స్వర్ణ, పట్రా లక్ష్మి, పేరుమల సత్యవతి పాల్గొన్నారు.










