
ప్రజాశక్తి-తాడేపల్లి : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పోస్టర్‌ను తాడేపల్లిలోని సుందయ్యనగర్ లీలా సుందరయ్య కళావేదికపై గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకులు కె.ఉషారాణి, పి.గిరిజ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బిజెపికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తొమ్మిదేళ్ల తరువాత అమల్లోకి వచ్చే ఈ బిల్లు ప్రస్తుతం ఎన్నికల లబ్ధి కోసమే బిజెపి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించిన నేపథ్యంలో వెంటనే చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె.విజయలక్ష్మి, ఎం.రేణుక, యు.జ్యోతి, అరుణ, కె.లక్ష్మి, వి.లక్ష్మి, కృష్ణవేణి పాల్గొన్నారు.