Jul 08,2023 23:42

మాట్లాడుతున్న ఎఎస్‌పి ధీరజ్‌

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌: మండలంలోని సుంకరమెట్ట గ్రామంలో గత నెల 5న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు దొంగలను అరెస్టు చేసినట్లు అల్లూరి జిల్లా ఏఎస్పి కె.ధీరజ్‌ తెలిపారు. శనివారం అరకులోయ పోలీస్‌ స్టేషన్లో ఏఎస్పీ కె.ధీరజ్‌ మీడియాతో మాట్లాడుతూ, మండలంలోని సుంకరమెట్ట గ్రామానికి చెందిన పాంగి సురేంద్ర ఇంటికి గత నెల 10న అర్ధ రాత్రి 12.30 సమయంలో గుర్తు తెలియని గొంగలు ఇంట్లో చొరబడి బీరువా పగలగొట్టి లక్ష ఇరవై వేల నగదు, రెండు తులాలు బంగారం దొంగిలించి పారిపోయారని అన్నారు. పాంగి సురేంద్ర పిర్యాదు మేరకు అరకులోయ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న గాలిస్తుండగా శనివారం నిందితులను మండలంలోని పద్మపురం పంచాయితీ రాజధాని జంక్షన్‌ వద్ద అరకు సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ రుద్రశేఖర్‌, ఎస్సై సంతోష్‌, సిబ్బంది చూడగా ఐదుగురు నిందితులు పోలీసులను చూసి పారి పోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకొని విచారించామన్నారు. ఈ కేసులో దొంగలు బాధిత ఇంట్లో చొరబడి నుదుటిపై రాడ్‌ తో కొట్టి ఇంటివాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి నగదు, బంగారం వస్తువులను దొంగలించి పారిపోయినట్లు తెలిపారు. అప్పటినుండి పోలీసుల వారి కోసం వెతుకుతుండగా శనివారం ఖచ్చితమైన సమాచారం వచ్చినందున అరుకు సీఐ, ఎస్సై సిబ్బందితో నిందితులను పట్టుకొని విచారించగా వారి వద్ద 5000 నగదు, రెండు తులాల బంగారం, రెండు ఆండ్రాయిడ్‌ ఫోన్లు, బొలోరా జీప్‌, స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో రంగీలా, పరశురామ్‌లు ఒడిశా రాష్ట్రానికి చెందినవారని, నందుల గంగులు, గెమ్మెలి గంగన్న, కొర్ర అప్పారావు అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ ప్రాంతాల వారని తెలిపారు.ఇంకో పది మంది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిని అరెస్ట్‌ చేయవలసి ఉందని తెలిపారు. అరకు సీఐ, ఎస్‌ఐ సిబ్బందికి ఏఎస్పి ధీరజ్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు.