ఉత్తరప్రదేశ్ ప్రధానంగా హిందీ మాట్లాడేవారున్న ప్రాంతం. ఈ ప్రాంతమంతటిలో స్థాయిపరమైన తేడాలున్నా ఇదే క్రమం కొనసాగింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమం, నిరుద్యోగం, ఇతర ఆర్థిక ఇబ్బందులతో ప్రజల్లో రగులుతున్న అసంతృప్తి కొంతమేరకు రాజకీయంగా ప్రభావాన్ని కనబరిచినా...సమాజంలో వ్యాపించిన హిందూ అనుకూల చైతన్యాన్ని తగిన రీతిలో మార్పు చేయలేదని స్పష్టమవుతోంది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా...ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల నుంచి ప్రధానంగా మూడు అంశాలను తీసుకోవాలి. మొదటిది, ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి బిజెపి నిర్ణయాత్మక విజయం సాధించడం, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో ప్రభుత్వాలను నిలబెట్టుకోవడం. బిజెపి దాని మిత్రపక్షాలకు తక్కువ మెజారిటీనే వచ్చినప్పటికీ, వారి ఓట్ల వాటా 3.65 శాతం నుండి 4.5 శాతానికి పెరిగింది. బిజెపి ఇంతలా ఘన విజయం సాధించడానికి అనేక కారణాలు వున్నాయి. కులాల గ్రూపులను, కూటములను కట్టడం, పెద్ద ఎత్తున ధన బలాన్ని ఉపయోగించుకోవడం, సామాజిక మాధ్యమాలను, అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం వంటి కారణాలు ఇక్కడ పనిచేశాయి. కానీ, హిందూ చైతన్యవాదం పెరగడమనే ప్రధాన అంశాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.
గత కొన్నేళ్ళుగా జనాభా లోని గణనీయ వర్గాలు (అంటే కేవలం అగ్ర వర్ణాలే కాదు) పాన్-హిందూ గుర్తింపుతో నిండిపోయాయి. జాతీయవాద కోణంలో హిందూత్వ ఆమోదం 'ఇతర' ముస్లిం మైనారిటీల పట్ల వ్యతిరేకత లక్ష్యంగా వుంది. సిఎస్‌డిఎస్ - లోక్‌నీతి సర్వే ప్రకారం, బిజెపి అన్ని వర్గాలపై - అగ్ర వర్ణాలు, ఇతర వెనుకబడిన తరగతులు, ఎస్.సి లు (ముస్లిమ్‌లు, యాదవులు, జాతవ్‌లు మినహా) అందరిపై పట్టును సాధించింది. నిర్దిష్ట కుల గుర్తింపులకు వెసులుబాటు కల్పించే పాన్ హిందూ ప్రాజెక్టు ప్రస్తుతం ఆచరణీయమైన ఒక పద్ధతిగా మారిపోయింది.
ఎస్.పి-ఆర్‌ఎల్‌డి ఇదే సవాలును ఎదుర్కొనడంలో విఫలమైంది. ఇందులో చాలా అంశాలు వున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రధానంగా హిందీ మాట్లాడేవారున్న ప్రాంతం. ఈ ప్రాంతమంతటిలో స్థాయిపరమైన తేడాలున్నా ఇదే క్రమం కొనసాగింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమం, నిరుద్యోగం, ఇతర ఆర్థిక ఇబ్బందులతో ప్రజల్లో రగులుతున్న అసంతృప్తి కొంతమేరకు రాజకీయంగా ప్రభావాన్ని కనబరిచినా...సమాజంలో వ్యాపించిన హిందూ అనుకూల చైతన్యాన్ని తగిన రీతిలో మార్పు చేయలేదని స్పష్టమవుతోంది.
ఈ సామాజిక వాస్తవికత-హిందూత్వ సిద్ధాంతాన్ని ఎదుర్కొనేందుకు స్థిరమైన రీతిలో రాజకీయ, సైద్ధాంతిక కృషి జరగాల్సిన అవసరాన్ని ముందుకు తీసుకువచ్చింది. మతపరమైన కోణాన్ని, అగ్ర వర్ణాల ఆధిపత్యాన్ని ఈ రెండింటినీ ఎదుర్కొనగలిగే ప్రత్యామ్నాయ సామాజిక -సాంస్కృతిక-సైద్ధాంతిక నిర్మాణాన్ని అందచేయాల్సిన ఆవశ్యకత నెలకొంది.
ఇక్కడ వామపక్షాలు కీలక పాత్ర పోషించాల్సి వుంది. హిందీ భాష మాట్లాడే ప్రాంతంలో పెద్ద శక్తిగా వున్నందున కాదు, ఇటువంటి ప్రత్యామ్నాయాన్ని నిర్మించగల సైద్ధాంతిక ఆధారం వుండడం ఇందుకు ప్రధాన కారణంగా వుంది. హిందూత్వ, మనువాద విధానాలను సవాలు చేసే ప్రజాస్వామ్య-లౌకికవాద సామాజిక-సాంస్కృతిక విలువల కోసం నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో ఇటువంటి ప్రత్యామ్నాయాన్ని నిర్మించగలిగేది వామపక్షాలే. ఇతర ప్రజాస్వామ్య లౌకికవాద శక్తులను ముందుకు తీసుకెళ్ళడానికి ఇదొక ప్రాతిపదిక కాగలదు.
ఇక రెండో అంశం-ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం. ఇతర రాష్ట్రాల్లో, ఉత్తరాఖండ్‌లో మినహా, కాంగ్రెస్ పనితీరు గత ఎన్నికల కన్నా చాలా అధ్వాన్నంగా వుంది. ఓట్ల వాటా, సీట్ల సంఖ్య రెండింటిలోనూ పేలవమైన పని తీరే కనబరిచింది. యు.పి లో, ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కేవలం 2.3 శాతం ఓట్లే రాబట్టుకోగలిగింది. గతంలో ఏడు సీట్లు దక్కించుకోగా ఈసారి కేవలం రెండింటితో సరిపెట్టుకుంది.
కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా క్షీణిస్తూ వస్తున్న ధోరణిని ఈ ఎన్నికల ఫలితాలు ధృవీకరించాయి. పైగా, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధిగా వున్న చోట్ల బిజెపి బాగా లాభపడింది. కాంగ్రెస్ తన గత ప్రాభవానికి ఇప్పుడు కేవలం నమూనాగా మారినప్పటికీ, ఆ రోజుల్లో ప్రధాన పార్టీగా వ్యవహరించడాన్ని ఇప్పుడూ కొనసాగిస్తోంది. బిజెపికి గట్టి పోటీనిచ్చే ప్రధాన శక్తిగా ఎస్.పి-ఆర్‌ఎల్‌డి కూటమే వుంటుందని అందరికీ తెలిసినా ఉత్తరప్రదేశ్‌లో అన్ని సీట్లకు కాంగ్రెస్ పోటీ చేయడమే ఇందుకు స్పష్టమైన ఉదాహరణగా వుంది. అంతకన్నా ఏం వివరించాలి !
కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రాంతీయ పార్టీకి, కేరళలో సిపిఎం, ఎల్‌డిఎఫ్ లకు ప్రతికూలంగా వుంటూ...హిందూత్వ సిద్ధాంతాన్ని అనుకరించాలని లేదా దానితో రాజీ పడాలని కాంగ్రెస్ భావిస్తోంది. గాంధీ కుటుంబంపై పూర్తిగా ఆధారపడడాన్ని విరమించకుండానే కొత్త, సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎలా రూపొందించాలా అనే ఒక అనిశ్చితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి కి సమర్ధవంతమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయడం అవసరం. ఇందుకు బిజెపి వ్యతిరేక శక్తులను ప్రతీ రాష్ట్రంలోనూ సమీకరించాల్సి వుంది. ఇందులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాల్సి వుంది.
ఇక ఈ ఎన్నికల్లో మూడో అంశం-పంజాబ్‌లో ఆప్ సాధించిన గణనీయమైన విజయం. ఢిల్లీలో గతంలో సాధించిన ఘన విజయం తరహాలోనే పంజాబ్‌లో కూడా విజయాన్ని సాధించింది. అయితే ఢిల్లీ మాదిరిగా కుదించబడిన రాష్ట్ర ప్రతిపత్తి వున్న రాష్ట్రం కాదు పంజాబ్. పూర్తి స్థాయి రాష్ట్రంలో ఈ విజయాన్ని సునాయాసంగా సాధించింది. సిక్కులు, హిందువులు, వారిలోని వివిధ సబ్ కేటగిరీలకు చెందిన వారి ఓట్లన్నీ పెద్ద మొత్తంలో ఆప్‌కు పడ్డాయని ఎన్నికల ధోరణి చూస్తుంటే స్పష్టమవుతోంది. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వ ఏర్పాటు మొదటి చర్యగా... ప్రతిపక్షాల పాలనలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఒక తాటి పైకి వచ్చి సంఘటితంగా కృషి చేసి, సమాఖ్యవాదాన్ని పరిరక్షించేందుకు, రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు ఒక ప్రేరణగా నిలుస్తుంది.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం /










