Jul 05,2023 00:16

మృత‌దేహంతో ధ‌ర్నా చేస్తున్న బంధువులు

ప్రజాశక్తి - వినుకొండ : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందిందని మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈపూరు మండలం కొచ్చర్లకు చెందిన కర్రా అనూష (20)కు 10 నెలల కిందట వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి కావడంతో గతంలోనే పుట్టింటికి వచ్చి వినుకొండలోని కీర్తి థియేటర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. రక్త హీనత ఉందని చెప్పిన వైద్యులు కొన్ని మందులు ఇస్తూ వచ్చారు. అయితే మంగళవారం పరీక్షించగా రక్త పరిమాణం ఐదు శాతమే ఉందని, చికిత్స అవసరమని రక్తం ఎక్కించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు వైద్యశాలకు తరలించాలని సూచించారు. గుంటూరుకు తరలించగా ఆమె చనిపోవడంతో ఆ మృతదే హాన్ని వినుకొండలోని ఆస్పత్రి ఎదుటకు తెచ్చి బంధువులు ధర్నా చేపట్టారు. కొద్దిసేపు ఆందోళన అనంతరం ఆస్పత్రి యాజమాన్యం, పోలీసులు, వైసిపి నాయకులు చర్చించి బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.