Oct 01,2023 01:05

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురు లోక్‌సభ నభ్యుల పదవీ కాలం ముగింపు దశకు వచ్చింది. షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిగినా వచ్చే జనవరిలో ఒట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో ఆశించిన ప్రతిపాదనలు ఆమోదం పొందే అవకాశం లేదు. జిల్లాకు చెందిన ఎంపీలు గల్లా జయదేవ్‌, లావు శ్రీకృష్ణదేవరాయులు, నందిగం సురేష్‌ ఐదేళ్లుగా వారు కేంద్ర ప్రభుత్వానికి రైల్వే పరంగా అనేక విజ్ఞాపనలు, ప్రతిపాదనలిచ్చినా చాలా వరకూ ఆమోదం పొందలేదు. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన ప్రతిపాదనలకు సంబంధించిన పనులే గత నాలుగేళ్లల్లో వివిధ దశల్లో ఉన్నాయి.
గత 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో నల్లపాడు-పగిడిపల్లి లైను డబ్లింగ్‌ చేయాలన్న ప్రతిపాదనలపై నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు కృషి మేరకు ఇటీవల రైల్వేబోర్డు ఆమోదించింది. ఈ లైను నిర్మాణం కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించే అవకాశం ఉంది. పల్నాడు ప్రాంతంలో ఇప్పటికీ రైల్వేల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. ఎనిమిదేళ్ల క్రితం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రతిపాదించిన అమరావతి రైల్వే లైను అటకెక్కింది. మూడు రాజధానుల ప్రతిపాదనల నేపథ్యంలో ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వమూ పట్టించుకోలేదు. 2016-17లో నిధులు కేటాయించినా ఆ తరువాత ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు.
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణ పనులు మందగమనంగానే సాగుతున్నాయి. నడికుడి నుంచి శావల్యాపురం మధ్య పనులు పూర్తయ్యాయి. తరువాత పనులు ముందుకు సాగడం లేదు. ప్రకాశం జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తికాకపోవడంతో ఈ లైను నిర్మాణంలో తీవ్ర జాప్యమవుతోంది. గుంటూరు-గుంతకల్లు మార్గంలో విద్యుద్దీకరణ పనులు, తెనాలి-గుంటూరు మధ్య డబ్లింగ్‌ పనులు పూర్తయినా మిగతా ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
మాచర్ల-గద్వాల్‌-రాయచూర్‌ రైలు మార్గం 40 ఏళ్ల క్రితం సర్వే చేశారు. రాయచూర్‌-గద్వాల్‌మార్గం పనులు పూర్తయ్యాయి. కానీ గద్వాల్‌ -మాచర్ల మధ్య రైలు మార్గం చేపట్టలేదు. గుంటూరులో కీలకమైన అరండల్‌పేట ఫ్లైవోవర్‌ బ్రిడ్జిని ఆరు వరుసల మార్గంగా గల్లా జయదేవ్‌ తొమ్మిదేళ్లుగా కోరుతున్నా ఇంతవరకు మోక్షం లభించలేదు. బాపట్ల నుంచి మచిలీపట్నం రైలు మార్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదననూ పట్టించుకోలేదు. ఈ మార్గంపై సర్వే పూర్తయిందని, నిజాంపట్నం, రేపల్లె మీదుగా తీర ప్రాంత వాసులకు రైలు సదుపాయాలు కల్పించాలన్న ఎంపీలు బాలశౌరి, నందిగం సురేష్‌ ప్రతిపాదనలు ఆచరణకు నోచుకోలేదు.
(ఎ.వి.డి.శర్మ)