
ప్రజాశక్తి - ఆరిలోవ : తీవ్రమైన తలనొప్పి ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ (ఐఐహెచ్) వ్యాధికి కారణం కావచ్చని న్యూరో ఆప్తమాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ సచ్ దేవా పేర్కొన్నారు. ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్యశాల న్యూరో ఆప్తమాలజి వైద్య బృందం ఆధ్వర్యాన ఆసుపత్రిలో శనివారం ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ వ్యాధి పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ వ్యాధి సాధారణంగా గర్భధారణ వయస్సు 20 నుంచి 50 మధ్య వయస్సు గల స్త్రీలలో, ఊబకాయం ఉన్న వారిలో వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ వ్యాధి రెండు కళ్లను, మెదడును ప్రభావితం చేస్తుందన్నారు. ఎడతెగని తలనొప్పి ఈ వ్యాధి సాధారణ లక్షణమన్నారు. దీనిని అశ్రద్ధ చేస్తే దృష్టి లోపం, చూపును పునరుద్ధరించలేని నష్టం, ఇతర సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. తీవ్రమైన తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే న్యూరాలజిస్ట్ లేదా ఆప్తమాలజిస్ట్‌ను సంప్రదించాలని డాక్టర్ వీరేందర్ తెలిపారు. ఈ వ్యాధి ఊబకాయం, విటమిన్ -ఎ సంప్లిమెంట్స్, యాంటిబయాటిక్ వాడకం, గర్భ నిరోధక మాత్రలు వాడటం, స్టెరాయిడ్స్ వంటి ప్రత్యేక మందులు తీసుకున్న వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఎల్‌విప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఈ వ్యాధి నిర్దారణకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు, చికిత్స అందించేందుకు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు.