దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖాముఖి చర్చలు జరపడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు అంత తీవ్రమైనవి కూడా కావు. వంశధార, జంఝావతి వంటి సాగునీటి ప్రాజెక్టుల సమస్యలు పరిష్కారమైతే రెండు రాష్ట్రాల ప్రజలకూ ప్రయోజనకరమే. కోఠియా గ్రామాలది సరిహద్దు అంశంగా చెబుతున్నప్పటికీ అంతకు మించి ఆ గ్రామాల ప్రజల సమస్యగా దీనిని చూడాలి. ఈ గ్రామాల్లోని గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం వంటి అనేక అంశాలు ఈ సమస్య పరిష్కారం చుట్టూ ముడిపడి ఉన్నాయి. పోలవరం, జల విద్యుత్ ప్రాజెక్టు వంటి అంశాలు కూడా ఇటువంటివే! అయినా, ఏళ్ళ తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయంటే పాలకుల చిత్తశుద్ధి లోపమే కారణమని భావించాలి. ఇప్పటికైనా భేషజాలు విస్మరించి ఇరు రాష్ట్రాల సి.ఎం లు సమావేశం కావడం, చర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయని ప్రకటించడం ఒక ముందడుగు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఏర్పాటైన సంయుక్త కమిటీ ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సి ఉంది.
కృష్ణ, గోదావరి జలాల విషయంలో కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కళ్లెదుటే ఉంది. పొరుగు రాష్ట్రంతో ఏర్పడిన సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి బదులు సర్వాధికారాలను మోడీ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. బోర్డుల పేరుతో ప్రాజెక్టుల నుండి పిల్లకాల్వల వరకు తన పరిధి లోకి తీసుకోవడం, తాము చెప్పినట్టుగానే స్థానిక ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పడం రాష్ట్రాల హక్కులపై దాడులు చేయడమే! నదుల అనుసంధానం పేరుతో దేశవ్యాప్తంగా జలవనరులపై తన పెత్తనం రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం పావులు కదుపుతోంది. నదీజలాల విషయంలోనే కాదు, మిగిలిన అన్ని అంశాల్లోనూ రాష్ట్రాల హక్కులను, అధికారాలను కబళించడమే మోడీ సర్కారు లక్ష్యం. అమెరికా వంటి దేశంలోనూ రాష్ట్రాలకు అనేక ప్రత్యేక హక్కులు, అధికారాలు కట్టబెట్టారు. అక్కడ కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగమే ఉంది. అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలను సైతం తిరస్కరించి, సొంత పథకాలను అమలు చేసే హక్కు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాని ఇక్కడ మోడీ సర్కారు రాష్ట్రాల హక్కుల విషయం వచ్చేసరికి దానికి భిన్నంగా వ్యవహరించడం, ఆదాయ వనరుల నుండి పిల్లల చదువుల వరకు ప్రతి విషయంలోనూ చొరబడి అధికారాలను హరిస్తుండటం దాని నియంతృత్వ స్వభావానికి నిదర్శనం.
ఈ నేపథ్యంలో తమ ప్రమేయం నామమాత్రంగా కూడా లేకుండా వేరువేరు పార్టీలకు చెందిన రెండు రాష్ట్రాల సి.ఎం లు పరస్పరం చర్చించుకోవడం మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం నచ్చదనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినా, ఇరు రాష్ట్రాల సి.ఎం లు సమావేశం కావడం, సమస్యల పరిష్కారం కోసం పరస్పరం చర్చించుకోవడమన్నది ఒక కీలక పరిణామంగానే చూడాలి. ఈ తరహా చర్చలు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి దోహదం చేయడమే కాదు, ఫెడరల్ వ్యవస్థ బలోపేతానికి దారి తీస్తుంది. ఇది దేశాన్ని మరింత పరిపుష్టం చేయడానికి, జాతీయ సమైక్యత భావనను పెంపొందించడానికి దోహదం చేస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఈ తరహా సంప్రదింపులే కృష్ణా జలాలను తమిళనాడుకు అందించే తెలుగుగంగ పథకాన్ని సాకారం చేశాయి. తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సమస్యల పరిష్కారానికి పరస్పర చర్చలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వమూ ఇదే బాట నడవాలి. ఒడిషాతోనే కాకుండా ఇతర పొరుగు రాష్ట్రాలతో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి సంప్రదింపుల మార్గాన్నే అనుసరించాలి. నాయకుల మధ్యనే కాదు, రెండు రాష్ట్రాల సాధారణ ప్రజల మధ్య కూడా ఈ తరహా చర్చలు సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని పెంపొందిస్తాయి. ప్రాంతీయ విభేదాల స్థానంలో ఐక్యతకు బాటలు వేస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం సాధించాలనే భారత రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయి.










