Oct 31,2023 18:17

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్‌పి

అహోబిలం గ్రామంలో కార్డన్‌ సెర్చ్‌
- 16 నాటు తుపాకులు, 3 బ్యారెళ్లు స్వాధీనం
- 18 ముద్దాయిలు అరెస్ట్‌
- జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

    ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిదిలోని అహోబిలం గ్రామంలో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించి 16 నాటు తుపాకులు, 3 బ్యారెళ్లు స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి కె.రఘు వీర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎఎస్‌పి జి.వెంకటరాముడుతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడారు. ఎఎస్‌పి పర్యవేక్షణలో ఆళ్లగడ్డ రూరల్‌ సిఐ పి.హనుమంతనాయక్‌, ఎస్సై టి.నరసింహులు, సిబ్బంది ఆధ్వర్యంలో కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఐదు పార్టీలుగా విడిపోయి అహోబిలం గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించారన్నారు. తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పారిపోయాడని, 18 మంది వ్యక్తులను ఆదుపులోకి తీసుకొని వారి నుండి 16 నాటు తుపాకులు, 3 బ్యారెళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరు ఎటువంటి లైసెన్స్‌ లేకుండా అక్రమంగా నాటు తుపాకులను కలిగి ఉన్నారని, వారిని అరెస్టు చేసి ఆళ్లగడ్డ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్ట్‌ అయిన వారిలో మొక్కలి ఆంజనేయులు, నరసింహ, గుజ్జారి శేఖర్‌, ఉదయగిరి నారాయణ, ఎం.శివ, పులి పాములేటి, కంబంపాటి నాగరాజు, మోకుల రామాంజనేయులు, కాకి హరి, కాకి రామాంజనేయులు ఏ అంజి, కొమ్మి అంకన్న, రాగి పాములేటి, వరికుంట్ల నారాయణ, సౌరం వీరయ్య, కొమ్మి ప్రభాకర్‌, సౌరం ఆంజనేయులు, కొమ్మి రామ క్రిష్ణ, ఇండ్ల తిరుపతి ఉన్నారని తెలిపారు. మొక్కల చంటి అనే వ్యక్తి పారిపోయినట్లు చెప్పారు. కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎస్‌డిపిఒ బి.వెంకట రామయ్య, రూరల్‌ సిఐ పి.హనుమంత నాయక్‌, అర్బన్‌ సిఐ ఎం.రమేశ్‌ బాబు, సిరివెళ్ల సిఐ వంశీధర్‌, కోయిలకుంట్ల సిఐ రామాంజనేయులు, సబ్‌ డివిజన్‌ ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్‌పి అభినందించారు.