Jul 17,2023 02:10
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్‌ కె రఘుచంద్‌

ప్రజాశక్తి-పంగులూరు: ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం, ఆలోచనలో మార్పు చేసుకుని, వ్యాయామం చేయడం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యాన్ని పెంచు కోవచ్చని, ప్రజా రోగ్య వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ కె రఘుచంద్‌ అన్నారు. ఈ మార్పులు చేసుకోకపోతే రోగాల బారిన పడి, అనేక బాధలు పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో, ఆదివారం పంగులూరులో ఆరోగ్య అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ రఘుచంద్‌ మాట్లాడుతూ తెల్ల బియ్యాన్ని ఎక్కువగా వాడుకోవడం వలన షుగరు, బిపి, కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం సమాజంలో బిపి, షుగర్‌తో పాటు, కాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా అధికంగా ఉన్నారని, ఈ నొప్పులు ఉన్నవారు నువ్వులు, క్యాబేజీ, మునగాకు ఎక్కువగా ఉపయోగించుకోవాలని అన్నారు. కూల్‌డ్రింక్స్‌ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయన్నారు. భావితరాలు బాగుండాలంటే ముడి బియ్యం వాడకంతో పాటు, కొర్రలు, వరిగలు, ఊదెలు, రాగులు, మొదలైన వాటిని వాడాలని రఘు చంద్‌ చెప్పారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం నాయకులు రాయిని వినోద్‌బాబు అధ్యక్షత వహించగా, పలువురు షుగరు, బిపి, మోకాళ్ల నొప్పులు, పేషెంట్లు పాల్గొన్నారు.