Nov 05,2023 00:22

హోటల్‌ను పరిశీలిస్తున్న ఉషోదయ యువజన సంఘం సభ్యులు

ప్రజాశక్తి- కవిటి: మండలంలోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, పానీపూరీ కేంద్రాలు, హోటళ్లు నిబంధనలు పాటించి, వంటకాల్లో ఘాటు తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి హానికరమైన వస్తువులు వినియో గించకుండా ఉండాలని ఉషోదయ యువజన సంఘం అధ్యక్షుడు పాండవ చంద్రశేఖర్‌ అన్నారు. స్థానిక ఉషోదయ కార్యాలయంలో ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుని వద్దకు వెళ్లినా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల వద్ద ఆహారం మానేస్తే మందులు అవసరం లేదంటున్నారని, హోటళ్లలో వాడుతున్న చైనాసాల్ట్‌, వివిధ రకాల రంగులు, నాసిరకం వంట నూనెలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇటీవల దీనిపై ప్రజాశక్తిలో వచ్చిన వార్తపై సమావేశంలో చర్చించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఇకపై మేలైన వంట పదార్థాలు ఉపయోగించటమే కాకుండా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఎటువంటి పదార్థాలు వాడకూడదని సూచించారు. అనంతరం కవిటిలో ఉన్న పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉషోదయ యువజన సంఘం సభ్యులు ఆరింగి మధు, పి.వెంకటరావు, పొల్లాయి లక్ష్మణమూర్తి, ఆరింగి రాజు, టి మోహనరావు, పి దశరథ్‌, పి సింహాచలం, బి రవి, ఆనంద్‌, జె లోకనాధం పాల్గొన్నారు.