ప్రజలకు వివిధ పథకాల ద్వారా ఇస్తున్న ఆహార సబ్సిడీని తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం డబ్బు మిగుల్చుకోవాలని చూస్తోంది. పేదల నోటి కాడి కూడు లాగేసి రూ.47,229 కోట్లను మిగుల్చుకోవచ్చన్న సలహా ఇచ్చింది ఎవరో కాదు. ప్రజల మేలు కోరాల్సిన 'నీతి ఆయోగ్'. అయితే కేంద్రం మిగుల్చుకోవచ్చంటున్న ఈ డబ్బు పేద ప్రజల, కార్మికుల చావుబతుకులను నిర్ధారిస్తుందనడంలో సందేహమే లేదు. లాక్‌డౌన్ సమయంలో 'ప్రజా పంపిణీ వ్యవస్థ' (పి.డి.ఎస్) ద్వారా అందిన రేషన్ పేద ప్రజలకు ఎంతగా మేలు చేసిందో చూశాం. ఒకవేళ ఆ పరిస్థితులలో పి.డి.ఎస్, ఉపాధి హామీ పథకాలు లేనట్టయితే...ఇప్పటి కంటే కోవిడ్ కాలంలో మరిన్ని కష్టాలపాలు కావాల్సి వచ్చేది.
ఉపాధి-వేతనాలు
కోవిడ్-19 వ్యాపించడానికిి, కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు, ఆర్థిక వ్యవస్థ మందగించడానికి ముందే ఉపాధి గ్యారంటీ, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ సక్రమంగా లేవు. 2020 సంవత్సరంలో పరిస్థితి మరింత క్షీణించింది. దేశంలో ఆ ఏడాది ఏప్రిల్ మాసంలో 12 కోట్ల 20 లక్షల ఉద్యోగాలు పోయాయని ఒక అంచనా. ఇవిగాక, 75 శాతం చిన్న వ్యాపారులు, దినసరి కూలీలు బాగా నష్టపోయారు. 2020 సెప్టెంబర్‌లో కూడా 12 కోట్ల 10 లక్షల ఉద్యోగాలు పోయాయని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) మహేష్ వ్యాస్ అంటున్నారు. లాక్‌డౌన్ అనంతరం అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు 22.6 శాతం పడిపోయాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) అంచనా.
దేశంలోని అధికశాతం కార్మికులు మరీ ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున వున్న వారి జీవితాలు ఛిద్రమయ్యాయి. వారి జీవనోపాధి మీద తీవ్ర ప్రభావం పడింది. లాక్‌డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోవడంలోనూ అంతరాలున్నాయి. మొదట లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వారిలో లింగపరమైన, కుల పరమైన అసమానతలు వున్నాయంటున్నారు ఆర్థికవేత్త అశ్వనీ దేశ్‌పాండే. మగవారితో పోల్చినప్పుడు ఆడవాళ్లు (పట్టణ మహిళల కంటే గ్రామీణ మహిళలు) ఎక్కువగా నష్టపోయారు. అగ్ర కులస్తుల కంటే దళితులు (షెడ్యూలు కులాలవారు) ప్రధానంగా గ్రామీణ దళితులు అధికంగా ఇక్కట్ల పాలయ్యారు. ఇతరులతో పోల్చినప్పుడు గ్రామీణ మహిళల ఉపాధిపై గట్టి దెబ్బపడింది.
మన దేశంలో అనేక సంవత్సరాల నుంచి 85 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. ఎక్కువ మందికి పని చేస్తేనే కడుపు నిండేది. పని చేయకపోతే గుప్పెడు మెతుకులు కూడా దొరకవు. అటువంటి చోట కేవలం నాలుగు గంటల ముందు లాక్‌డౌన్ విధించేటప్పుడు బాధ్యతాయుతంగా మెలగాల్సిన ప్రభుత్వం ఏం ఆలోచించింది? కుటుంబ సభ్యులు ఆకలితో నకనకలాడుతుంటే ఎంతకాలం చూస్తుండాలి?
ఆహారం-ఆకలి
'హంగర్ వాచ్' సంస్థ దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలలో 3,994 మందిని కలిసి నిర్వహించిన సర్వేలో కలచివేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అట్టడుగు వర్గాలలో ఆకలి మహమ్మారి తిష్ట వేసుకు కూర్చుందని తేలింది. లాక్‌డౌన్ విధించడానికి ముందుకంటే...సెప్టెంబర్-అక్టోబర్ 2020లో తీసుకునే ఆహారం తగ్గింది. తినే తిండిలో పోషక విలువలూ క్షీణించాయి. లాక్‌డౌన్ విధించిన ఐదు నెలల తర్వాత కూడా ఖాళీ కడుపుతోనే నిద్రకు ఉపక్రమించాల్సిన పరిస్థితిలో మార్పేమీ రాలేదు. ఆరేడు మాసాల తర్వాత కూడా ఆకలితోనే గడపాల్సి వచ్చిందని సర్వే నివేదిక చెప్తోంది. ఆదాయం లేకపోవడంతో తినడానికేమీ లేక, ఒకవేళ కొద్దిగా ఆహారం కొనుగోలు చేయగలిగినా పోషకాహారం తీసుకోలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నవంబర్ 2020 తర్వాత 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ యోజన' పథకం ద్వారా అందించే ఉచిత రేషన్ నిలిపివేయాలన్నది ఎంతటి కఠిన నిర్ణయమో అర్థమౌతుంది.
షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతులు, మైనారిటీ తెగలకు సంబంధించిన వారిలో...80 శాతం మంది ఆదాయం లాక్‌డౌన్‌కు ముందు కేవలం నెలకు రూ.7 వేలు మాత్రమే వుండేది. వీరివి అత్యంత దయనీయ గాథలు. ఐదు నెలల తర్వాత లాక్‌డౌన్ ముగిసినప్పటికీ ఆకలి సమస్య తీరనేలేదు. అధికశాతం కుటుంబాల ఆదాయం 62 శాతం తగ్గింది. తృణధాన్యాలు (53 శాతం), పప్పు ధాన్యాలు (64 శాతం), కూరగాయలు (73 శాతం), గుడ్లు-మాంసం (71 శాతం) తీసుకోవడం బాగా తగ్గిపోయింది. గుప్పెడు మెతుకుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషను, స్కూలు/అంగన్‌వాడీ పిల్లలకు ఇచ్చే రేషను, నగదు బదిలీలు సగం మందికి పైగా అందాయి (మిగతావాటితో పోల్చుకుంటే పిడిఎస్ ప్రజలకు మరింత చేరువలో వుంది). ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మాత్రం సహకారం వున్నప్పటికీ ఇవేవీ వారి అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోయాయని 'హంగర్ వాచ'్ సర్వేలో తేలింది. లాక్‌డౌన్ ముందు కంటే వీరు తీసుకునే ఆహారం తగ్గిపోయింది.
ఆరోగ్యం అంతంత మాత్రమే
దేశంలో పోషకాహార లోపం చాలా తీవ్రంగా వుందని 'జాతీయ ఆరోగ్య సర్వే (5)-2019' చెప్తోంది. కోవిడ్ మహమ్మారి రావడానికి ముందు కూడా ఇలాగే వుంది. 2014 నుంచి 2019 మధ్యలో దేశంలో ఆరోగ్య పరిస్థితిపై సర్వే దృష్టి సారించింది. అనేక రాష్ట్రాలలో పారిశుధ్యం, తాగునీటి సౌకర్యం మెరుగుపడినప్పటికీ ఐదేళ్ల లోపు చిన్నారుల్లో పోషకాహార స్థాయి మాత్రం అంతకంతకూ పడిపోతోంది. పిల్లలు గిడసబారిపోవడం, వయసుకు తగ్గ ఎత్తు బరువు లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వున్నాయి. శిశుమరణాల రేటు కూడా అధికంగానే వుంది. పిల్లలు గిడసబారిపోవడం వల్ల వారి శారీరక ఎదుగుదలకు, మేధో వికాసానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేకపోవడం అనేది తెలంగాణ, బీహార్, అసోం, జమ్ముకాశ్మీర్, మహారాష్ట్రలో అధికంగా వుంది. 60 శాతం పైగా శిశు మరణాలకు పోషకాహార లోపమే కారణం. అందుకే భావిభారతం మీద తీవ్ర ప్రభావం చూపే పోషకాహార లోప సమస్యను కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సి వుంది.
ఆర్థిక పరిస్థితి
పేదలకు ఇచ్చే రేషన్ తగ్గించి డబ్బు మిగుల్చుకోవాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం... బడా కార్పొరేట్లకు మాత్రం పన్ను మినహాయింపులు, ఇతర సబ్సిడీలతోపాటు రుణాల రద్దు చేయడం ద్వారా రూ.7,99,354 కోట్ల నష్టాన్ని నెత్తిన వేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. 2015-16, 2018-19 మధ్య కాలంలో బడా పారిశ్రామికవేత్తలకు రూ.4,32,584 కోట్ల రుణాల రద్దు చేసింది. కేవలం రూ.25,659 కోట్లు (10 శాతం) మాత్రమే వారి నుంచి వసూలు చేసింది. పెద్ద పారిశ్రామికవేత్తలకు గత ప్రభుత్వం రద్దు చేసిన దానికంటే, ఈ ప్రభుత్వం 3 రెట్లు ఎక్కువ రుణాలను వారికి రద్దు చేసింది. వ్యవసాయ రుణాలు రద్దు చేసినదానికంటే...12 ప్రముఖ కార్పొరేట్ల నిరర్ధక ఆస్తుల వల్ల ప్రభుత్వ ఖజానాకు రెండు రెట్లు ఎక్కువ నష్టం కలిగింది.
ప్రజలకు ప్రభుత్వ మద్దతు కొనసాగాల్సిందే
ఆర్థిక సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్‌లో కోల్పోయిన ఉపాధి, తగ్గిపోయిన ఆదాయాల నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు తమ మద్దతును కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రభుత్వ సహకారం అవసరమైన పేద కార్మిక ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాదు. మార్కెట్లో డిమాండ్‌ను పునరుద్ధరించడానికి...తద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేయడానికి ఇది ఉపకరిస్తుంది. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి అందరినీ భాగస్వాములను చేయాలి. బియ్యం, పప్పుధాన్యాలు, పంచదార, నూనెలు వంటి నిత్యావసర సరుకులన్నిటిని పి.డి.ఎస్ ద్వారా ప్రజలకు అందించాలి.
నీతి ఆయోగ్, భారత ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓవైపు ప్రభుత్వ గోదాముల నిండా ఆహార ధాన్యాలున్నా మరోవైపు పోషకాహార కొరత పెద్ద ఎత్తున వుంది (కోవిడ్ ముందు కూడా). ప్రజలకు జీవనాధారం లేదు. ఇటువంటప్పుడు బతకడానికి కనీస ఆధారమైన బియ్యం కూడా ప్రభుత్వం ప్రజలకు అందించలేదా? ఇంక ప్రభుత్వం వున్నదెందుకు? కొద్ది రోజుల కిందట ఆధార్ అనుసంధానం చేయలేదన్న సాకుతో ప్రభుత్వాలు సుమారుగా 3 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయడం, ఆ అమానవీయ చర్యకు సుప్రీం కోర్టు సీరియస్ కావడం చూశాం. మీరు ఏం కోరుకుంటున్నారు? రాత్రుళ్లు ఇంకా ఎంతమంది పస్తులుండాలని మీరనుకుంటున్నారు? మీ ఖాతాలో ఇంకా ఎన్ని ఆకలి చావులు నమోదు చేసుకోవాలనుకుంటున్నారు?
ఈ కోవిడ్ మహమ్మారి కాలంలో ఏం నేర్చుకున్నారు? కొరతలు, లోపాలు వున్నప్పటికీ మారణహోమం జరగకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆపగలిగింది. దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహించిన, ధ్వంసం చేసిన ప్రజారోగ్య వ్యవస్థే నేడు అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాలను కాపాడింది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను నిర్లక్ష్యం చేయొద్దని ఎంతోమంది శాస్త్రవేత్తలు, మేధావులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కోవిడ్-19 లాంటి మహమ్మారులు మున్ముందు రాకుండా వుండాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచిస్తూనే వున్నారు. ఇది మీ బుర్రలకు ఎక్కడం లేదా?
ప్రజారోగ్యాన్ని, ప్రజా పంపిణీని, ప్రభుత్వ రంగాలను కాపాడుకుంటూ వాటిని పటిష్టం చేసినప్పుడే అందరికీ ఆరోగ్యం, ఆహార భద్రతతో పాటు ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది.
మూలం: సుజాతా గొథోస్కర్
/ 'ది వైర్' సౌజన్యంతో /










