Sep 12,2023 23:29

జేసీతో సమావేశమైన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు

ప్రజాశక్తి-గుంటూరు : ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు తీరును తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం తరపున సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ స్టడీ అనే సంస్థ వారు మంగళవారం గుంటూరు నగరంలోని ఐదు రేషన్‌ షాపులు తనిఖీ చేశారు. ఆయా షాపులలో ప్రజాపంపిణీ వ్యవస్థ అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 కింద ఉన్న లబ్దిదారులతో మాట్లాడి వారికి అన్నీ సక్రమంగా చేరుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను పరిశీలించి, అక్కడి పనివిధానం, ఆన్‌లైన్‌ వ్యవస్థ గురించి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారితో సమావేశయ్యారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు గురించి తెలుసుకున్నారు. జెసి చట్టం అమలు, పౌరసరఫరాలపై వచ్చే ఫిర్యాదులు, వాటి పరిష్కారం, విజిలెన్స్‌ కమిటీలు వాటి పనితీరు గురించి వారికి వివరించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పి.కోమలిపద్మ పాల్గొన్నారు.