ప్రజాశక్తి-విశాఖపట్నం : జాతీయ ఆహార భద్రత చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్.విజయప్రతాప్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాథన్‌తో కలిసి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థీ, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలు, విద్యార్థులు, గర్భిణులకు ఆహార భద్రత కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాల మేరకు అందాలని పేర్కొన్నారు. ఈ విషయమై రెండు రోజులుగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, రేషన్ దుకాణాలు, ఎంఎల్‌ఎస్ గోదాములు తనిఖీ చేశామని చెప్పారు. అంగన్‌వాడీ వ్యవస్థ మరింత మెరుగుపడాలన్నారు. కేంద్రాల్లో విద్యార్థుల హాజరు సక్రమంగా నమోదు చేయాలని చెప్పారు. పిల్లల జ్ఞాపకశక్తి, ఆరోగ్యాన్ని మరింత పెంపొందించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఈ బియ్యాన్ని అందిస్తున్నామని, త్వరలోనే రాష్ట్రమంతా సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. మొబైల్ రేషన్ వాహనాల ద్వారా అందిస్తున్న బియ్యానికి బదులుగా డబ్బు పంపిణీ చేస్తే సంబంధిత రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు.
జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం 2013 అమలుకు అధికారులు కృషి చేయాలని, కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి తనిఖీలలో గుర్తించిన లోటుపాట్లును సంబంధిత శాఖల అధికారులు తక్షణమే సరిచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆహార కమిషన్ మెంబర్ కాంతారావు, స్టేట్ ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్ ,విశాఖపట్నం డిఎస్‌ఒ సూర్య ప్రకాశరావు, అనకాపల్లి జిల్లా డిఎస్‌ఒ కెవిఎల్‌ఎన్ ప్రసాద్, విశాఖ డిఇఒ చంద్రకళ , అనకాపల్లి డిఇఒ రామలింగేశ్వర్, ఐసిడిఎస్ పిడి వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.










