ఆర కాకర అనగానే ఇంకేమీ గుర్తుకురావు. వీటిని సరిగ్గా వండాలే కానీ మాంసాహారం కూడా సాటిరాదు. చిన్నాపెద్దా అంతా లొట్టలేస్తూ లాగించేస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఆర కాకరకాయల్ని(ఆ కాకర, బొచ్చు కాకర, బోడ కాకర) కాస్తంత వెరైటీగా వండితే..! ఇంక అంతే..! మధుమేహం ఉన్నవారు విరివిగా వాడే ఆర కాకరకాయలతో ఎలాంటి వెరైటీలు చేయాలో తెలుసుకుందాం..
అవి తిన్నాక మీరే.. 'ఆహా ఆర కాకర!' అనకపోతే చూడండి..!
కారప్పొడి
కావాల్సిన పదార్థాలు : ఆర కాకర - 250 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు-15, పల్లీలు-టీ స్పూన్, కరివేపాకు-1/2 కప్పు, పచ్చిశనగపప్పు-టీస్పూన్, మినపప్పు-టీస్పూన్, ధనియాలు-టీస్పూన్, సొంటి-చిన్నముక్క, జీలకర్ర-టీస్పూన్, ఎండుమిర్చి -6, ఉప్పు-రుచికి సరిపడా, కారం-2 స్పూన్లు, నూనె-తగినంత.
తయారుచేసే విధానం : ముందుగా ఆర కాకరను బాగా కడుక్కుని, తడి లేకుండా తుడుచుకోవాలి.
తర్వాత గుండ్రంగా కట్ చేసుకోవాలి. వీటిని నూనెలో క్రిస్పీగా వేయించి ఓ బౌల్‌లోకి తీసుకోవాలి.
తర్వాత వెల్లుల్లి రెబ్బలను నూనెలో క్రష్ చేసి, దోరగా వేయించుకోవాలి.
అదే నూనెలో పల్లీలు వేసి వేయించుకోవాలి. వీటిని కూడా వేరే బౌల్‌లో తీసుకోవాలి.
కరివేపాకు, ఎండుమిర్చిని కూడా క్రిస్పీగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో నూనెను తగ్గించుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, సొంటి, జీలకర్ర వేసి దోరగా వేయించి పోపు చేసుకోవాలి.
కొద్ది మిశ్రమం పక్కన పెట్టుకుని, మిగిలిన దాన్ని మిక్సీ జారులోకి తీసుకుని ఉప్పు, కారం వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.
దీనిలో ఆర కాకర ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీటిలోకి ముందుగా తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పోపును కలిపితే ఆర కాకర కారప్పొడి రెడీ. వేయించిన పల్లీలనూ కావాలంటే వేసుకోవచ్చు. దీన్ని వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోశల్లో తింటే ఆహా అనిపిస్తుంది.
నిల్వ పచ్చడి
కావాల్సిన పదార్థాలు : ఆర కాకర - 250 గ్రాములు, నిమ్మకాయలు-4, కారం -6 టీస్పూన్లు, ఉప్పు-6 టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్ -3 టీస్పూన్లు, ఆవపొడి-2 టీస్పూన్లు, నూనె-200 మి.గ్రా, ఆవాలు-టీస్పూన్, జీలకర్ర-టీస్పూన్, ఎండుమిర్చి-3, కరివేపాకు-1/2 కప్పు.
తయారుచేసే విధానం : ఆర కాకరను గుండ్రంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టౌ మీడియంలో పెట్టుకుని, రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
తర్వాత బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి.
పాన్‌లో మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
ఇందులో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి.
స్టౌ ఆపు చేసుకుని చల్లారనివ్వాలి.
ఫ్రై చేసుకున్న ఆర కాకర ముక్కలకు, కారం, ఉప్పు, ఆవపొడి వేసి బాగా కలుపుకోవాలి.
ఇందులో నిమ్మకాయల రసం వేసుకోవాలి.
దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పోపును వేసి బాగా కలుపుకోవాలి.
ఎంతో టేస్టీగా కనిపించే ఆర కాకర నిల్వ పచ్చడి రెడీ.
పప్పులపొడి ఫ్రై
కావాల్సిన పదార్థాలు : ఆర కాకర - పావుకేజీ, పప్పుల పొడి- కప్పు, ఉల్లిపాయ ముక్కలు-కప్పు, నూనె - డీప్ ఫ్రైకి తగినంత, ఉప్పు - తగినంత, పసుపు- చిటికెడు.
పప్పులపొడి : పుట్నాలుపప్పు (వేయించిన శనగపప్పు)-100 గ్రాములు, ఎండుమిర్చి-4, ఉప్పు-తగినంత, జీలకర్ర-టీస్పూన్.
ముందుగా వీటిని వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో పొడిగా పట్టుకుని, బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
తయారుచేసే విధానం : ఆర కాకర కాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో నూనెపోసి వేడెక్కాక, సన్నగా తరిగి పెట్టుకున్న ఆర కాకర కాయ ముక్కలు వేసుకోవాలి.
కొద్దిగా వేగాక, ఉల్లిపాయ ముక్కలు వేసి తిప్పాలి.
ఇందులో చిటికెడు పసుపు వేసి మూతపెట్టి, కొద్దిసేపు మగ్గనివ్వాలి.
ఐదునిమిషాలకు ఒకసారి తిప్పుతూ బాగా వేగనివ్వాలి.
తర్వాత ఎక్కువగా ఉన్న నూనెను తీసేసి, డీప్‌ఫ్రై చేసుకుంటూ పప్పులపొడిని జత చేసుకోవాలి.
తర్వాత కొద్దిసేపు వేగనిచ్చి, పప్పులపొడి ఆర కాకర ముక్కలకు బాగా పట్టేలా తిప్పుకోవాలి అంతే.. పప్పుల పొడి ఫ్రై రెడీ.
పకోడీ
కావాల్సిన పదార్థాలు : ఆర కాకర -250 గ్రాములు, మజ్జిగ-కప్పు, పసుపు-అరటీస్పూన్, ఉప్పు-తగినంత, ఉల్లిపాయలు-2(పేస్ట్), అల్లంవెల్లుల్లి- టీస్పూన్(పేస్ట్), శనగపిండి-కప్పు, కారం-టీస్పూన్, నూనె-వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : ఆర కాకర కాయల్ని రెండు ముక్కలుగా తరిగి.. మధ్యలో కొద్దిగా గాటు పెట్టుకోవాలి.
పాన్‌లో మజ్జిగ, పసుపు తీసుకుని ఆర కాకర ముక్కల్ని వేసి, ఉడికించి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఓ గిన్నెలో ఉల్లిపాయ మిశ్రమం, అల్లంవెల్లుల్లి ముద్ద, స్పూను శనగపిండి, కారం, తగినంత ఉప్పు తీసుకుని, అన్నింటినీ గట్టిపిండిలా కలపాలి.
ఈ మిశ్రమాన్ని కాకరకాయ ముక్కల్లో కూరుకోవాలి.
మిగిలిన శనగపిండిని బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి.
కొద్దిగా ఉప్పు వేసుకుని, సిద్ధం చేసుకున్న కాకర ముక్కల్ని ఇందులో ముంచి.. కాగుతున్న నూనెలో వేయించాలి.
బంగారు వర్ణంలోకి వచ్చాక దింపేస్తే సరిపోతుంది. కరకరలాడే ఆర కాకర పకోడీ రెడీ..