Dec 23,2022 16:28

ప్రజాశక్తి-పిచ్చాటూరు : రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శుక్రవారం తిరుపతి వారు పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టు గ్రామంలో వ్యవసాయంలో డ్రోన్ లు ఉపయోగించి పురుగుమందుల పిచికారీపై అవగాహన కల్పించి ప్రదర్శన నిర్వహించినట్లు కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డా ఎస్.శ్రీనివాసులు తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.ప్రసాద్ రావు, ఉప సంచాలకులు ధనుంజయ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరు కాగా మండల స్థాయి వ్యవసాయ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.ప్రసాదరావు మాట్లాడుతూ వ్యవసాయంలో నూతన సాంకేతికత వినియోగించటం వలన రైతులు శ్రమ తగ్గి మంచి ఆదాయం సాధ్యం అవుతుందని, కూలీల కొరత ప్రధాన సమస్యగా ఉన్న ప్రస్తుత కాలంలో రైతులు తప్పనిసరిగా వ్యవసాయ యాంత్రీకరణ వైపుగా ఆలోచించి ముందుకు సాగాలని తెలిపారు. రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డా.ఎస్.శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలకు సంబంధించి భారతీయ వ్యవసాయ పరశోధనా మండలి, న్యూ ఢిల్లీ వారు వ్యవసాయ డ్రోన్ ల వినియోగాన్ని రైతులకు చేరవేయడానికి రాస్ కృషి విజ్ఞాన కేంద్రంను ఎంపిక చేయటం జరిగిందని, ఈ ప్రాజెక్ట్ లో భాగంగా జిల్లాలోని వివిధ మండలాలలో రైతు పొలాలలో డ్రోన్ వినియోగించి ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహించటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సాంకేతికత గురించి ఆయన మాట్లాడుతూ డ్రోన్ వినియోగించి పిచికారీ ద్వారా నీరు, పురుగుమందు, కూలీల ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని, మామూలు పద్దతి కన్నా ఈ పద్ధతిలో పురుగుమందు ప్రభావం బాగా ఉంటుందని రైతులు ఈ నూతన సాంకేతికతను వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తరువాత గ్రామంలో 30 ఎకరాల  వేరుశెనగ పంటలలో డ్రోన్ వినియోగించి పురుగుమందు పిచికారీ పై ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.ప్రసాదరావు, వ్యవసాయ ఉప సంచాలకులు  ధనుంజయ రెడ్డి, వ్యవసాయ సహా సంచాలకులు రమేష్ రెడ్డి, రైతు శిక్షణా కేంద్ర వ్యవసాయ అధికారిని శ్రీమతి సరళ, మండల వ్యవాయాధికారి సంజీవ రెడ్డి, కే.వి.కే సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డా.ఎస్.శ్రీనివాసులు, శాస్త్రవేత్త రాము కుమార్, ఆయా సచివాలయం  గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.