ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై ఆగస్టు ఒకటి నుంచి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు యాత్ర చేపడుతున్నట్లు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాలవ శ్రీనివాసులుతోపాటు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఆచరణలో ప్రాజెక్టుల నిర్మాణం ఒక్క అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. దీంతో ఈ ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించేందుకు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఆగస్టు ఒకటవ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా బనకచెర్ల నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. మొదటి రోజు కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని రెండో రోజు అంటే ఆగస్టు రెండో తేదీన కడప జిల్లాలోని గండికోట రిజర్వాయరుతో పాటు, అక్కడి ప్రాజెక్టులను ఆయన పరిశీలిస్తారన్నారు. రెండో తేదీ రాత్రికి అనంతపురం చేరుకుంటారని చెప్పారు. రెండో తేదీన అనంతపురం జిల్లాలోని ఉరవకొండ వద్ద సామూహిక బిందు, తుంపెర సేద్యం ప్రాజెక్టును పరిశీలించి, అక్కడి నుంచి బిటిపికి ఎత్తిపోతల పథకం, పేరూరు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారని తెలిపారు. మూడవ తేదీన చిత్తూరు జిల్లాకు వెళతారని కాలవ శ్రీనివాసులు వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తున్నట్టు వైసిపి పెద్దఎత్తున ప్రచారం చేసిందని గుర్తు చేశారు. ఇది తరువాత అటకెక్కించారన్నారు. తమ హయాంలో రూ.980 కోట్లతో చేపట్టిన బిటిపి ఎత్తిపోతల పథకం, పేరూరు ఎత్తిపోతల పథకం ఏవీ ముందుకు పడలేదన్నారు. వైఎస్.జగన్మోహన్‌రెడ్డి రాయలసీమకు తీరని నష్టాన్ని మిగిల్చారని విమర్శించారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని తెలిపారు.










