ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ సామర్లకోట లేఅవుట్‌లో సామూహిక గహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ నెలాఖరులో జిల్లా పర్యటనకు రానున్నట్లు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, హౌసింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరు జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ జి.లక్ష్మీశతో కలిసి కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్, జెసి ఎస్.ఇలక్కియ జి.రాగంపేట రోడ్డులోని ఇటిసి సమీపంలో జగనన్న కాలనీ లేవుట్‌ను సందర్శించారు. పట్టాపొంది ప్రభుత్వ సహకారంతో ఇంటిని నిర్మించుకుని నివసిస్తున్న బొబ్బర పద్మ గృహాన్ని సందర్శించారు. అనంతరం లేఅవుట్ సమీపంలోని జూనియర్ కళాశాలలోని సిఎం సభా వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. పెద్దాపురం మండలం, జి.రాగంపేట రోడ్‌లోని హెలిప్యాడ్ స్థలాన్ని ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక డిఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్లో అజరు జైన్, లక్ష్మీశ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు గృహ నిర్మాణం, రెవెన్యూ, మునిసిపల్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, మెప్మా తదితర శాఖల అధికారులతో చర్చించారు. లేఅవుట్‌లో మొత్తం మంజూరైన ఇళ్లు, పూర్తయిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న ఇళ్లు, రహదారులు, డ్రెయిన్లు, విద్యుత్, తాగునీరు, ఓపెన్ ప్లేస్‌లో హరిత విస్తీర్ణం పెంపు, స్వాగత ద్వారం, పైలాన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ జి.వీరేశ్వర ప్రసాద్, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, హౌసింగు డిఇ రాజు, మెప్మా పీడీ బి.ప్రియంవద, డ్వామా పీడి అడపా వెంకటలక్ష్మి, కాకికాడ డీఎల్‌డీవో పి.నారాయణమూర్తి, సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జె.రామారావు, ఎంపిడిఒ డి.శ్రీలలిత, మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి, వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్, ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఆవాల లకీëనారాయణ పాల్గొన్నారు.










