Aug 18,2023 00:36

పేరేచర్ల లేఅవుట్‌లో ఇళ్లను పరిశీలిస్తున్న ఎమ్‌డి

ప్రజాశక్తి-గుంటూరు : పేదలందరికీ ఇళ్ల పథకం లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలు నిర్దేశిత సమయానికి పూర్తయ్యేలా గృహనిర్మాణ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకొని పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ జి.లక్ష్మీషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డితో కలిసి ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గృహనిర్మాణ, ఆర్‌డబ్య్లూఎస్‌, విద్యుత్‌, పంచాయతి రాజ్‌, డ్వామా, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. లక్ష్మీషా మాట్లాడుతూ ఆగస్టు చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్లను సిఎం ప్రారంభించనున్నారని, గుంటూరు జిల్లాలో 12,500 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో 12,500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినందుకు కలెక్టర్‌, జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకం లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా అధికారులు నిరంతరం సమీక్షించాలని చెప్పారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు ఉపాధి హామీ చట్టం ద్వారా మ్యాజిక్‌ సోప్‌ పిట్‌లు, మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, డ్రెయినేజీల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. లే అవుట్‌లకు స్వాగత ద్వారాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లే అవుట్‌లకు అప్రోచ్‌ రోడ్ల ఏర్పాటుకు ఇతర మౌలిక సౌకర్యాల పనులకు క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్రింద నిధులను కేటాయించామని, పనులకు 20 శాతం అడ్వాన్స్‌లు అందిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ళ పథకంలో 67,250 ఇళ్లు జిల్లాకు మంజూరు చేయగా 99 శాతం ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యాయన్నారు. 42,451 ఇళ్లు బేస్మేంట్‌పైనా వివిధ దశలలో ఉన్నాయని వివరించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు విద్యుత్‌, తాగునీటి సౌకర్యం వెంటనే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బేస్మేంట్‌ లెవల్‌పైన ఉన్న ఇళ్ళు స్టేజీ కన్వర్షన్‌పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక, నీరు, విద్యుత్‌తో పాటు ఇతర మౌలిక సౌకర్యాలను కల్పించటానికి గృహనిర్మాణ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో హౌసింగ్‌, డ్వామా పీడీలు వేణుగోపాల్‌, యుగంధర్‌ కుమార్‌, జెడ్పీ సిఇఒ మోహనరావు, ఆర్‌డబ్య్లూఎస్‌ ఎస్‌ఇ సురేష్‌, హౌసింగ్‌ ఈఈలు శంకరరావు, భాస్కరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పూర్తయిన ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలి
పేదలందరికీ ఇళ్ల పథకం లేఅవుట్‌లలో నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు విద్యుత్‌, తాగునీటి సౌకర్యం ఇతర మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించాలని అధికారులను లక్ష్మీషా ఆదేశించారు. గురువారం మేడికొండూరు మండలం పేరేచర్లలోని లేఅవుట్‌-3లో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, నిర్మాణం పూర్తయిన 84 ఇళ్లను పరిశీలించారు. ఇళ్లల్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులతో మాట్లాడారు. విద్యుత్‌, తాగునీటి పంపుల ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఇళ్లకు సోప్‌ పిట్స్‌ , మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. రూఫ్‌ లెవల్‌ లో ఉన్న ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని, బెస్‌మెంట్‌, ఆ పైన దశలో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పూర్తయిన ఇళ్లకు బిల్లులు సకాలంలో మంజూరు చేయాలన్నారు. లే అవుట్‌ స్వాగత ద్వారం పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలని, అంతర్గత రహదారులు ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ అధికారులు వేణుగోపాల్‌, మండల ప్రత్యేక అధికారి, సహకార శాఖ సీఈవో చారి, హౌసింగ్‌ ఈఈ శంకరరావు పాల్గొన్నారు.