Aug 02,2023 23:43

ప్రజాశక్తి-కాకినాడ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద ఆగస్టు 9 మహాధర్నా కరపత్రాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ఇపిఎఫ్‌ పెన్షన్‌ రూ.9 వేలు ఇవ్వాలని, స్కీమ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, నాలుగు లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని, కేంద్ర సంస్థలలో 13 లక్షల ఖాళీ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని, ఉపాది హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి, రోజుకు రూ.600 చెల్లించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అసంఘటితరంగ కార్మికులైన హమాలి, ఆటో ట్రాన్స్‌ పోర్ట్‌, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల డిమాండ్‌ చేశారు. మోడీని గద్దెదించండి. దేశాన్ని కాపాడండి అనే రాజకీయ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళు తున్నామని తెలిపారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, టిఎన్టియుసి నాయకులు వీర్రాజు, ఐఎఫ్‌టియు నాయకులు జె.వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఆగస్టు 9వ తారీఖున క్విట్‌ ఇండియా స్ఫూర్తితో విజయవాడ, జిల్లా కేంద్రాలలో జరిగే మహా ధర్నాలను జయప్రదం చేయాలని కార్మికులకు, ఉద్యోగులకు, రైతులకు, వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు పిఎస్‌.నారాయణ, ఎంఎస్‌.నారాయణ, పెద్ద పండు, రాజు, ఐఎన్‌టియుసి నాయకులు కె.భవాని, రమణ, మరియమ్మ, మంగమ్మ, బొడ్డు సత్యన్నారాయణ మూర్తి, శ్రీపాదం సత్తిబాబు, గరగ దుర్గబాబు, నాని పాల్గొన్నారు.