Aug 17,2023 21:48

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

         పుట్టపర్తి అర్బన్‌ : ఆగస్ట్‌ 30న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం ఉంటుందని ఈ మేరకు జిల్లాలో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా||జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం సంబంధిత కార్యదర్శులతో కలిసి ఏపీ సెక్రటేరియట్‌ నుంచి వర్చువల్‌ విధానంలో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టపర్తి కలెక్టరేట్‌ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, ఇన్‌ఛార్జి సంయుక్త కలెక్టర్‌, పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, డిఆర్‌ఒ కొండయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 2023 ను అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో మిల్లెట్స్‌ రాగులు, జొన్న కొర్ర తదితరాలను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 25వేల ఎకరాలలో రైతులు రాగి పంట విస్తీర్ణంగా పండిస్తున్నారని చెప్పారు. రాగి పంట విస్తీర్ణపై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో రీ సర్వే రెండవ విడతలో భూముల రీ సర్వే పూర్తి అయిన వాటిలో రాళ్ళు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. అనుకున్న లక్ష్యం మేరకు గృహ నిర్మాణ పనులు ముందుకుసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.