అగ్రవర్ణాల పేదలకు అండగా ఇబిసి నేస్తం
- 14,794 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 22.19 కోట్లు జమ
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర ఒసి సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన పేద మహిళలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి 'వైయస్సార్ ఈబీసీ నేస్తం' పథకం కింద 45-60 సంవత్సరాల మధ్య వయసున్న అర్హులైన అగ్రవర్ణాలకు చెందిన అక్క చెల్లెమ్మలకు రెండవ విడత ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైయస్సార్ ఈబీసీ నేస్తం వర్చువల్ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, మార్క్‌ఫెడ్ చైర్మన్ పిపి.నాగిరెడ్డి, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్, బీసీ కార్పొరేషన్ ఏఈఓ జాకీర్ హుస్సేన్ హాజరై వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈబిసి నేస్తం పథకం కింద జిల్లాలో 14,794 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 22.19 కోట్లు జమ చేశామని తెలిపారు. ఈ పథకం కింద రెండవ విడతలో జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 3,196 మంది లబ్ధిదారులకు రూ.4 కోట్ల 79 లక్షల 40 వేలు, బనగానపల్లిలో 3,352 మందికి రూ.5 కోట్ల 2 లక్షల 80 వేలు, డోన్‌లో 1,946 మందికి రూ.2 కోట్ల 91 లక్షల 90 వేలు, నందికొట్కూర్‌లో 1,594 మందికి రూ.2 కోట్ల 39 లక్షల 10 వేలు, నంద్యాలలో 2,836 మందికి రూ.4 కోట్ల 25 లక్షల 40 వేలు, శ్రీశైలంలో 1,870 మందికి రూ. 2 కోట్ల 80 లక్షల 50 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్, మార్క్‌ఫెÛడ్ చైర్మన్, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ తదితరుల చేతుల మీదుగా మహిళలకు చెక్కును అందజేశారు.










