Sep 19,2023 18:30

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
అగ్రిగోల్డ్‌ బాధి తులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అగ్రిగోల్డ్‌ కష్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల భీమారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాసరావుకు నాయకులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా జగన్‌ తమకు న్యాయం చేస్తారని బాధితులు ఆశగా ఎదురు చూస్తున్నారని, మరో ఆరు మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయని తమకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధితుందరికీ డిపాజిట్లు వడ్డీతో సహా చెల్లించాలని, మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులకు రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రూ.పది వేలు, రూ.ఇరవై వేలు డిపాజిట్లు చెల్లిస్తామని కమిటీలు వేసి కొందరికే ఇచ్చారని విమర్శించారు. అసోసియేషన్‌ పట్టణ అధ్యక్షుడు కె.గోపాలకృష్ణ మాట్లాడుతూ తక్షణం బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పట్టణ గౌరవాధ్యక్షులు ఎం.సీతారాంప్రసాద్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, ఎపి మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.