Jul 24,2021 20:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అగ్రిగోల్డ్‌ బాధితులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తక్షణమే వారితో చర్చలు జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన రిలే దీక్షలు 3వ రోజు శనివారం కొనసాగాయి. కడప, చిత్తూరు జిల్లాల బాధితులు దీక్షలో కూర్చున్నారు. మధు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు దీక్షలో కూర్చున్నవారికి పూలదండలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పేద ప్రజలు, దాచుకున్న సొమ్మును దోచుకున్న అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని నడిరోడ్డుపై వేలాడదీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని చెప్పిన రూ.1,150 కోట్లను సిఎం వైఎస్‌ జగన్‌ చెల్లించాలని కోరారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే వైసిపి ప్రభుత్వమూ అనుసరిస్తుందా? అనే అనుమానం కలిగిలే ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. పోలవరం వద్ద గోదావరిలో మునిగిపోతున్న ప్రజలకు పునరావాసం లేదని, కార్మికులకు కనీస వేతన సలహా మండలి లేదని, రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేదని, ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే అన్ని రాజకీయపక్షాలతో రౌండ్‌టేబుల్‌ నిర్వహించి, కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఎపికి అన్ని విధాలా అన్యాయం జరుగుతున్న తరుణంలో విద్యుత్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేసిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని కోరారు.

ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఫలితం అనుభవిస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. బాధితులకు న్యాయం చేయకుంటే భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, యూనియన్‌ నాయకులు తిరుపతిరావు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.