Oct 31,2022 21:37

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
           అగ్రి గోల్డ్‌ బాధితుల సమస్యలు పరిష్కరించి, వారి ఆత్మహత్యలు ఆపాలని సిపిఐ మండల కార్యదర్శి జమ్మి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ పి.నాగమణికి అగ్రిగోల్డ్‌ బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ కంపెనీ బాధితులకు ఆరు నెలల్లో పూర్తి న్యాయం చేస్తామని సిఎం జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. పదేపదే అనేక సభల్లో ఇదే విషయం ప్రస్తావించారన్నారు. కానీ రూ.20 వేల లోపు బాధితులకు మాత్రమే న్యాయం చేశారని, మిగిలిన వారిని వదిలేశారన్నారు. అందరికీ సత్వరం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయక కార్యదర్శి తాడిగడప ఆంజనేయరాజు, పట్టణ కార్యదర్శి ఎస్‌కె.బాజీ, బాధితులు ఆకుల సూర్యనారాయణ, ఎ.శ్రీనివాసరావు, భవాని, కె.సత్యనారాయణ, టి.గంగారత్నం, గూదే ధనలక్ష్మి, ధూళి ఏసమ్మ, వెంకటేశ్వరరావు, కండెల్లి సుబ్బమ్మ, జి.సాయిబాబు, మింటి మంగతాయారు, దుర్గ, ఇళ్ల సత్యవతి, సీతామహాలక్ష్మి, వి.మంగారావు, శాంతకుమారి, మహాలక్ష్మి పాల్గొన్నారు.