Jul 08,2023 23:36

మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు, చిత్రంలో అఖిలపక్ష నాయకులు

ప్రజాశక్తి- అనకాపల్లి
అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రతినిధులు స్పందించి వారికి డిపాజిట్లు తిరిగి ఇప్పించే విధంగా కృషి చేయాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో శనివారం అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై జరిగిన అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు, వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తుందన్న నమ్మకంతో డబ్బులు దాచుకుంటే, అగ్రిగోల్డ్‌ మోసం చేసి బాధితులను రోడ్డు పడేసిందని తెలిపారు. దీంతో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడి వందలాదిమంది చనిపోయారన్నారు. బాధితులు నిరాహార దీక్ష నేపథ్యంలో జగన్మోహన్‌ రెడ్డి తాము అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోగా డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని చెప్పారని, కాని నాలుగేళ్లు దాటినా అరాకొర చెల్లింపులు తప్ప ఇప్పటికీ డిపాజిట్లు పూర్తిగా చెల్లించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్‌ బాధితుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఆగస్టు 30న విజయవాడ ముట్టడికి పూనుకుంటామని హెచ్చరించారు. సిపిఎం నాయకులు జి. కోటేశ్వరరావు, ఆర్‌.శంకర్రావు మాట్లాడుతూ బాధితుల పోరాటానికి అండగా ఉంటామన్నారు. బాలేపల్లి వెంకటరమణ (సిపిఐ), బొలిశెట్టి శ్రీనివాసరావు (టిడిపి), ఐఆర్‌ గంగాధర్‌ (కాంగ్రెస్‌), కొణతాల హరినాథ్‌ బాబు (ఆప్‌), సూదికొండ మాణిక్యాలరావు (బిఎస్‌పి), రామకృష్ణ (బిజెపి), న్యాయవాది కనిశెటి సురేష్‌బాబు తదితరులు మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ బాధితుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఇవి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ నేత రాజాన దొరబాబు, అసోసియేషన్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు వి.తిరుపతిరావు, వైఎన్‌.భద్రం, కర్ణం మాణిక్యాలరావు, మొల్లేటిగోపాల రమణ, జెరుపోతుల దుర్గారావు, శేషు, కోన లక్ష్మణ్‌, అధిక సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.