Jun 25,2023 23:30

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ రైతుల సంక్షేమానికి ఎన్నో చేస్తున్నామని వైసిపి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇంతవరకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మార్కెట్లో పతనం అయినపుడు రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు. ఉద్యాన పంటలకు మూడేళ్లపాటు ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. ఇవన్నీ అటుంచితే... ఎరువులు, విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. జగ్గంపేట మండలంలో మూడేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన జిల్లాస్థాయి అగ్రి ల్యాబ్‌ ఒక్కటే అందుబాటులో ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పి ఏడాదిన్నర క్రితం ప్రారంభించినప్పటికీ ఇంతవరకు పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రాలేదు. శంఖవరంలో పనుల్లో ఉన్న ల్యాబ్‌కు పరీక్షలకు అవసరమైన పరికరాలు రాలేదు.
రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత తెలుసుకునేందుకు, భూసార పరీక్షలు చేసేందుకు గ్రామీణ ప్రాంతంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అగ్రి ల్యాబ్‌, జిల్లా స్థాయిలో మరో ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రక టించింది. వీటిల్లో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశువులకు రక్త పరీక్షలు, ఇతర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తామని పేర్కొంది. కాకి నాడలో జిల్లాస్థాయి అగ్రి ల్యాబ్‌ ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. 2019 జగ్గంపేట, శంఖవరం మండలాల్లో ల్యాబ్‌ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. జగ్గంపేటలో నిర్మాణం పూర్తయ్యి రైతులకు అందుబాటులోకి వచ్చినా, జిల్లాలో ఇప్పటివరకు మరొక ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేయకపోవడం పట్ల ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు.
ల్యాబ్‌లో పరీక్షలకు, పరిశోధనలకు అవసరమైన పరికరాలు చాలా రోజుల వరకు రాలేదు. పరికరాలు వచ్చిన తరువాత కూడా సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. జగ్గంపేట ల్యాబ్‌లో మార్చి నెల నాటికి 451 రకాల విత్తన నమూనాలు, 301 రకాల ఎరువులు నమూనాలను పరీక్షలు జరిపి రైతులకు సమాచారం అందించినట్టు సిబ్బంది చెబుతున్నారు. ల్యాబ్‌లో నత్రజని ఎరువు నాణ్యత పరీక్షల కోసం ఆధునాతన జలాల్‌ యూనిట్‌, విత్తనాల నాణ్యతను తెలిపే సీడీ డివైడర్‌. విత్తన తేమ శాతాన్ని నిర్ధారించే హాట్‌ ఎయిర్‌ ఓవెన్‌తో పాటు పలురకాల రసాయనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మారుతున్నాయి.
అందుబాటులోకి రాని కేంద్రాలు
జిల్లాలో శంఖవరం మండలం అగ్రి ల్యాబ్‌ భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడ ంతో ప్రారంభానికి నోచుకోలేదు. భవన నిర్మాణాలకు రెండేళ్లుగా నిధులు విడుదలలో ఇప్పటివరకు ప్రభుత్వం జాప్యం చేసింది. ఇప్పుడు నిధులు విడుదల చేసిన నిర్మాణాలు పూర్తయ్యేసరికి ఎంత సమయం వెచ్చించాలనేది ప్రశ్నార్ధకరంగా మారింది. అగ్రిలకు సంబంధించిన పరికరాలను కూడా ప్రభుత్వం ఇంకా పంపించకపోవడం ప్రతి నియోజకవర్గంలోనూ ఇంకా పనులు పూర్తిస్థాయిలో పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు.