ప్రజాశక్తి - గోనెగండ్ల
మండలంలోని బి.అగ్రహారం గ్రామంలో చాలా ఏళ్లుగా అంతక్రియలు నిర్వహించేందుకు స్థలం లేక శ్మశాన సమస్యను గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. గత కొద్ది నెలల క్రితం ఒక దళిత యువకుడు మృతి చెందడంతో శ్మశానం కోసం దళితులంతా ఆందోళన చేపట్టారు. గ్రామంలోని సర్వే నెంబరు 244/1లో 44 సెంట్ల స్థలాన్ని దళిత శ్మశాన వాటికకు కేటాయించామని రెవెన్యూ అధికారులు తెలియజేయడంతో అక్కడ అంత్యక్రియలు నిర్వహించి, అంబేద్కర్ చిత్రపటంతో శ్మశాన వాటిక బోర్డు ఏర్పాటు చేసుకొని చుట్టూ కంచె వేసుకున్నారు. కొద్ది రోజులకే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మృతి చెందారు. మళ్లీ శ్మశాన సమస్య తలెత్తడంతో దళితులకు కేటాయించిన భూమి పక్కనే ఉన్న మిగులు భూమిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా పక్కనే ఉన్న పొలం యజమాని అభ్యంతరం తెలిపాడు. గ్రామస్తులు నాలుగు రోడ్ల కూడలిలో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. రెవెన్యూ, పోలీసు అధికారులు రంగ ప్రవేశం చేసి దళితులకు కేటాయించిన శ్మశాన వాటిక భూమి పక్కనే మిగులు భూమిలో అంత్యక్రియలు నిర్వహింపజేశారు. కొద్ది రోజుల తర్వాత పొలం యజమాని భూస్వామి రామేశ్వర రెడ్డి శ్మశాన స్థలంపై తనకు పట్టా ఉందని హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దళితులు ఏర్పాటు చేసుకున్న బోర్డులో అంబేద్కర్ చిత్రపటానికి సిమెంట్ పూసి, వారు ఏర్పాటు చేసుకున్న కంచెను పీకి వేశారని పోలీసు స్టేషన్‌లో దళితులు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
చాకలి ఆదెమ్మ మృతితో మొదటికొచ్చిన సమస్య
గురువారం గ్రామంలో చాకలి ఆదెమ్మ అనే మహిళ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గతంలో అంత్యక్రియలు నిర్వహించిన స్థలంలో హైకోర్టు స్టే ఉన్నందున వేరే చోట అంతక్రియలు నిర్వహించుకోవాలని సూచించడంతో గ్రామస్తులు ఆందోళనకు పూనుకున్నారు. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్, బీఎస్పీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, ఎర్రన్న, ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తుల తరఫున ఆందోళనకు దిగారు. ఆగ్రహం చెందిన గ్రామస్తులు, మహిళలు గ్రామంలోని గ్రామ సచివాలయం ఎదుట గుంతను తీసి మృతదేహాన్ని పూడ్చేందుకు పూనుకున్నారు. సమస్య తీవ్రం కావడంతో వేణుగోపాల్, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు రంగ ప్రవేశం చేసి గతంలో అంత్యక్రియలు నిర్వహించిన స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహింపజేస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని తీసుకొని పాత స్థలం దగ్గరకు చేరుకున్నారు. తిరిగి అక్కడ కొలతల పేరుతో కాలయాపన చేయడంతో గ్రామస్తులు తిరిగి ఆందోళనకు దిగారు. రెవెన్యూ అధికారులు పాత స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహింపజేయడంతో సమస్య సద్దుమణిగింది.
స్టే రద్దుకు తగిన చర్యలు తీసుకుంటాం
- తహశీల్దార్ వేణుగోపాల్
శ్మశానానికి కేటాయించిన స్థలం పక్కన భూస్వామి తెచ్చిన స్టేను రద్దు చేయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ వేణుగోపాల్ తెలిపారు. ఆయనకు ములుగుందం గ్రామంలో కూడా చాలా భూములు ఉన్నాయని, ఆయన సమర్పించిన పట్టాలు కూడా చెల్లుబాటు కావని తెలిపారు. త్వరలో కోర్టులో కౌంటర్ వేసేందుకు తగిన దస్త్రాలు తయారు చేశామని తెలిపారు. ఎమ్మిగనూరు టౌన్ సిఐ మధుసూదన్, పెదకడబూరు ఎస్‌ఐ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు రూరల్ ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి, రైతు సంఘం నాయకులు నరసింహులు, కెవిపిఎస్ గ్రామ నాయకులు బాలస్వామి, రంగస్వామి, బాలరాజు పాల్గొన్నారు.










