ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : అగ్నివీర్ ర్యాలీకి సర్వం సిద్ధమైంది. అగ్నిపథ్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విజయనగరంలో తలపెట్టిన విషయం విదితమే. ఈ నెల 20న తెల్లవారుజాము నుంచే స్థానిక పోలీసు శిక్షణ కళాశాల మైదానంలో ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు మొత్తం 13 జిల్లాల నుంచీ సుమారు 10 వేల మంది యువకులు ఈ ర్యాలీకి హాజరు కానున్నారు. ఇందుకనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ఆగస్టు 2 వరకు మొత్తం 14రోజులపాటు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కొనసాగనుంది.
మొదటి రోజు హాజరు కావాల్సిన అభ్యర్థులు 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకల్లా పిటిసి గ్రౌండ్‌వద్ద సిద్దంగా ఉండాలని అధికారులు స్పష్టంచేశారు. రాత్రి 12.30 గంటలకు గ్రౌండ్‌లోపలికి అనుమతిస్తారు. ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్న లక్ష్యంతో పలుచోట్ల సిసి కెమెరాలను అమర్చారు. ఆర్మీ ఉన్నతాధికారుల నిఘా, పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారంతో ఫ్లడ్‌లైట్ల వెలుగుల మధ్య ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ర్యాలీకి హాజరుకావాలని అధికారులు స్పష్టంచేశారు. ఎంపిక ప్రక్రియ ప్రతిరోజూ రాత్రి 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. రోజుకు వెయ్యి మంది అభ్యర్థులు హాజరయ్యే విధంగా అధికారులు అడ్మిట్ కార్డులను జారీచేశారు.
ఎంపిక ప్రక్రియ ఇలా
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా తమకు కేటాయించిన నిర్ణీత తేదీకి అవసరమైన సర్టిఫికెట్లను తీసుకొని అభ్యర్థులు 30 నిమిషాల ముందు హాజరు కావాలి. అడ్మిట్ కార్డు, 20 కలర్ పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్, నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివిధ సర్టిఫికెట్లను తీసుకురావాలి. అడ్మిట్ కార్డు, బార్‌కోడ్‌ను పరిశీలించి, వెయ్యి మందిని లోపలికి అనుమతిస్తారు. వీరిని రెండు బ్యాచ్‌లుగా విడదీస్తారు. అభ్యర్థులకు ముందుగా ఎత్తు కొలిచి, లోపలికి అనుమతించి, 1.6 కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహిస్తారు. విడతకు వంద మంది చొప్పున పరుగు పందెం నిర్వహిస్తారు. ఈ దూరాన్ని ఐదున్నర నిమిషాల్లో పూర్తి చేసినవారికి 60 మార్కులు, 5.45 నిమిషాల్లో, ఆ లోగా పూర్తి చేసినవారికి 48 మార్కులు కేటాయిస్తారు. అంతకంటే సమయం దాటితే అనర్హులవుతారు. ఈ పరుగు పందెంలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే తదుపరి పరీక్షలకు అనుమతిస్తారు. ప్రతి అభ్యర్ధీ కనీసం 6 పులప్స్ తీయాల్సి ఉంటుంది. 10 పులప్స్ తీస్తే గరిష్టంగా 40 మార్కులు, 9 తీస్తే 33, 8 తీస్తే 27, 7 తీస్తే 21, 6 పులప్స్ తీస్తే 16 మార్కులు వస్తాయి. ఆ తరువాత జిగ్‌జాగ్ నడక, 9 అడుగుల లాంగ్ జంప్ పోటీలు ఉంటాయి. ఈ రెండింటిలో కేవలం ఉత్తీర్ణులైతే సరిపోతుంది. అనంతరం అభ్యర్ధులకు మరునాడు ఉదయం సర్టిఫికెట్లను తనిఖీ చేసి, వైద్య పరీక్షల అనంతరం తుదిజాబితా తయారు చేస్తారు. ప్రస్తుతం విస్తృతంగా వర్షాలు కురుస్తుం డటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు.
ఏర్పాట్లు ఇవీ
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెట్విజ్, పిటిసి, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, రవాణా, వైద్య, డిఆర్‌డిఎ, విద్య, ఆర్ అండ్ బి, విద్యుత్, ఐఅండ్‌పిఆర్ తదితర శాఖలు ఈ ర్యాలీ ఏర్పాట్లలో భాగస్వాములు అయ్యాయి. తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను కల్పించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని పరేడ్ గ్రౌండ్స్‌లో వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు బస చేయడం కోసం యూత్ హాస్టల్, రాజీవ్ స్టేడియంలో నామమాత్రపు రుసుంతో వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్‌కు చేరుకొనేందుకు ఆర్‌టిసి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రాత్రి 12 గంటలకు ఎంపిక ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్ధులు, అన్ని దశల్లోని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేస్తే, మరునాడు సాయంత్రం గ్రౌండ్ నుంచి బయటకు వస్తారు. వీరికి అల్పాహారం, భోజనాన్ని కల్పించనున్నట్టు జిల్లా యంత్రాంగం చెబుతోంది.
సద్వినియోగం చేసుకోండి
రిక్రూట్‌మెంట్ కోసం పటిష్టమైన ఏర్పాట్లను చేశాం. జిల్లాకు చెందిన యువత అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తున్నాం. సాయుధ దళాల్లో చేరాలనుకొనే యువతకు ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ చక్కని అవకాశం. ఇది దేశానికి సేవ చేసేందుకు మంచి అవకాశం. సైనిక దళాల్లో చేరినవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
- ఎస్.నాగలక్ష్మి, కలెక్టర్, విజయనగరం జిల్లా










