Mar 10,2023 22:05

ప్రజాశక్తి - వేలేరుపాడు/కుక్కునూరు
            అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయి రోడ్డునపడ్డ కన్నాయిగుట్ట అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కన్నాయిగుట్ట గ్రామస్తులకు సిపిఎం మండల కమిటీ చేయూతనందించింది. శుక్రవారం 27 కుటుంబాలకు రెండు క్వింటాళ్ల బియ్యం 50 కేజీల ఉల్లిపాయలు, పంచదార, కందిపప్పు, టీ పొడి ప్యాకెట్లు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రవి మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గురై సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన 27 గిరిజన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రతీ కుటుంబానికి రెండు రూ.లక్షల నష్టపరిహారం, తాత్కాలికంగా ఉండేందుకు అవసరమైన ఇల్లు నిర్మాణానికి అయ్యే ఖర్చు, బియ్యం ఇతర నిత్యావసర సరుకులను ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి ధర్ముల రమేష్‌ మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవిలో ఏదో ఒకచోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, కట్టుబట్టలతో ఎంతోమంది రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఫైర్‌ ఇంజిన్‌ కూడా లేకపోవడం ప్రమాద తీవ్రతను మరింత పెరిగిందన్నారు. మండలంలో జరిగే ప్రమాదాలకు ఫైర్‌ ఇంజన్‌ రావాలంటే పక్కమండలంలోని కుక్కునూరు నుంచి రావాల్సి ఉంటుందని, సుమారు 25 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి మండల కేంద్రంలో ఫైర్‌ ఇంజిన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. సిపిఎం జిల్లా నాయకులు మడివి దుర్గారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులను ఇప్పటివరకూ ప్రభుత్వం పట్టించుకోలేదని, సర్వసం కోల్పోయి నిరాశ్రయులైన భాధితులను ప్రభుత్వం వెంటనే అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడకం ఏసుబాబు, కొత్త వెంకటేశ్వర్లు, గుమ్మాల వెంకట నరరసయ్య పాల్గొన్నారు.